ఈ దేశానికి ఒకప్పుడు ప్రధానులుగా పనిచేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలపై బీజేపీ నేత, ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తల్లీకొడుకుల హత్యలు ప్రమాదాలేనని జోషి అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారని వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.
బలిదానం అంటే అది..
బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని విమర్శించారు. బలిదానం అంటే భగత్‌సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్‌లదని చెప్పారు. వారు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలారన్నారు. గాంధీల కుటుంబంలో జరిగింది ప్రమాదం మాత్రమేనని పేర్కొన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉదని వెల్లడించారు. రాహుల్ గాంధీ తెలివితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు.
మోడీ లేకపోతే జెండా కూడా..
ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మరియు సైనిక్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న జోషి.. జమ్మూ కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ యాత్రను సజావుగా ముగించారంటే అందుకు ప్రధాని నరేంద్ర మోడీనే కారణమన్నారు. మోడీ నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండకపోతే, రాహుల్‌గాంధీ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉండేవారు కాదన్నారు. కానీ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ.. జమ్ములో ఉధ్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడే అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు.