ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అనేక ఘనతలు సాధిస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలకు సీఈవోలుగా రాణించగా, రాజకీయ రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఇప్పటికే కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉండగా, ఇటీవలే రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరపున వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ ‘భారతీయ మూలాలపై గర్వంగా ఉంది. అటు బ్లాక్ (నల్ల జాతి) కాదు ఇటు వైట్(తెల్ల జాతి) కాదు. ఇది భిన్నమైంది. నీ ఫోకస్ ఎప్పుడూ వైరుధ్యాల మీద కాక సారూప్యతల మీద ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది’ అని చెప్తూ బైడెన్ పనితీరు ఘోరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. తనను తాను నూతన తరం నాయకురాలిగా చెప్తూ ‘దేశ సరిహద్దులను కాపాడడం కోసం, ఆర్ధికంగా బాధ్యతాయుతంగా ఉండడం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం, మన ప్రతిష్టను పెంచడానికి నూతన తరం బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చింది’ అని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఇక ఫిబ్రవరి 15న భారీ ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. అటు ట్రంప్ వయసు 76 ఏళ్లు కావడంతో 51 ఏళ్ల నిక్కీ హేలీకి ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
నిక్కీ హేలీ నేపథ్యం ఇదీ
పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి వలస వెళ్లిన పంజాబీ దంపతులకు నిక్కీ 1972లో సౌత్ కరోలినాలో జన్మించారు. క్లెమ్సన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. 1996లో సౌత్ కరోలినా సైన్యంలో కమిషన్డ్ ర్యాంకు అధికారి మైకేల్ హేలీని వివాహం చేసుకున్నారు. 2010లో తొలి మైనార్టీ మహిళా గవర్నర్‌గా కొత్త రికార్డు క్రియేట్ చేశారు. 2014లో కూడా గవర్నర్‌గా ఎంపికయ్యారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా పంపించారు.
Get excited! Time for a new generation.
Let’s do this! 👊 🇺🇸 pic.twitter.com/BD5k4WY1CP
— Nikki Haley (@NikkiHaley) February 14, 2023
‘ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. కాగా, నిక్కీ తండ్రి అజిత్ సింగ్ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. అనంతరం బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ రావడంతో మొదట కెనడా వెళ్లి పీహెచ్‌డీ పూర్తయిన తర్వాత 1969లో అమెరికాలో స్థిర పడ్డారు. ఆమె తల్లి ఢిల్లీలోని విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. నిక్కీ హేలీ పూర్తి పేరు పెళ్లి కాకముందు నిమ్రతా నిక్కి రంధ్వావా. నిక్కీ అనేది పంజాబీలో పెట్టుకునే ముద్దు పేరు. మనం చింటూ, పింటూ, పండు లాగా అన్నమాట.