కరోనా వైరస్ సామాన్య మానవుల జీవితాన్ని తలకిందులు చేసి సమూలంగా మార్చేసింది. ఒకపక్క వైరస్ భయం, మరోపక్క మనుగడ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. స్వార్థం కూడా జడలు విప్పి ఆడుతోంది. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. మొన్నటివరకు కేజీ 15 రూపాయలకు కూడా అందుబాటులో ఉన్న ఉల్లి వందకు చేరింది. టమోటా చుక్కలు చూపుతోంది. ద్రవ్యోల్బణం మనదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతోంది. ఒక పక్క డబ్బుల్లేకపోవడం, మరోపక్క ఉన్న డబ్బులకు కాసిని సరుకులు కూడా రాకపోవడం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న దృశ్యాలు.
ఇండోనేసియాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాలేజీ ఫీజులు కట్టలేక విద్యార్థులు ‘సార్, డబ్బుల్లేవు. మా తోటలో కాసిన కొబ్బరికాయలు పుచ్చుకోండి..’ అంటున్నారు. కాలేజీలు కూడా చేసేదేమీ లేక సరేనంటున్నాయి. పర్యాటక రంగానికి పేరుమోసిన బాలి వంటి ద్వీపాల్లో ఈ తతంగం సాగుతోంది. విద్యార్థుల కష్టాలను చూసి, డబ్బుకు బదులు కొబ్బరికాయలను ఫీజుగా చలామణి చేస్తున్నారు. కాలేజీలు వాటిని అమ్ముకుని మళ్లీ డబ్బు చేసుకుంటున్నాయి. ఇండోనేసియాలో కొబ్బరి విపరీతంగా పండడంతో ప్రస్తుతానికి రాజీమార్గం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇండోనేసియాలో కరోనా వల్ల 15 వేల మంది చనిపోగా, 27 కోట్ల 70 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు.