జురాసిక్ పార్క్ వద్దే వద్దు.. ఇండోనేసియాలో రచ్చరచ్చ  - MicTv.in - Telugu News
mictv telugu

జురాసిక్ పార్క్ వద్దే వద్దు.. ఇండోనేసియాలో రచ్చరచ్చ 

October 29, 2020

Indonesia komodo Jurassic park

జురాసిక్ పార్క్  సినిమా గురించి మీకు తెలుసు కదా. ఆ చూడని వాళ్లు ఎవరూ ఉండరు. డైనోసార్లు వెంటాడుతుంటే పారిపోయే సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మూవీలో రాకాసి బల్లుల కోసం ప్రత్యేకంగా ఓ దీవిలో ఏర్పాటు చేసిన ఆ పార్క్‌లాంటి పార్క్ ఒకటి ఇండోనేసియాలో నిజంగానే ఏర్పాటు కాబోతోంది. అందులో డైనోసార్లు ఉండవు లెండి. ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ల జాతికే చెందిన కొమొడో డ్రాగన్లు ఉంటాయి. ఉంటాయి, అని చెప్పేకంటే ఆల్రెడ్రీ ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకోడానికి ఇండోనేసియా ప్రభుత్వం కొమొడో దీవుల్లో కొమొడో నేషనల్ పార్క్ పేరుతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నేలపై ఉన్న బల్లుల్లో కొమొడోలే అతి పెద్ద బల్లులు. పార్క్ నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేస్తుండగా ఓ కొమొడో అడ్డొచ్చింది. ‘ఏయ్, మర్యాదగా వెళ్లిపో’ అని వార్నింగ్ ఇచ్చింది. ఆ సమయంలో ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ప్రకృతిని, వన్యప్రాణులను నాశనం చేసి పార్క్ నిర్మించడం సరికాదని జంతుహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్క్ కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నారని, ఇది మహావిధ్వంసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సేవ్ కొమొడో గ్రూప్’ పేరుతో సోషల్ మీడియాలో భారీస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. 

అయితే పార్క్ వల్ల ఆ బల్లులకు ఏ నష్టమూ రాదని ఇండోనేసియా ప్రభుత్వం చెబుతోంది. ‘వాటిని మరింత బాగా కాపాడుకుంటాం. వాటి కోసం నీటి కుంటలు, ఎత్తయిన వేదికలు నిర్మిస్తాం. కేవలం పర్యాటకులకు వినోదం కోసమే పార్కును నిర్మిస్తున్నాం. బల్లులకు హాని కలిగించడం మా ఉద్దేశం కాదు..’ అని అంటోంది.  కొమొడోలు ఇండోనేసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. 10 అడుగుల పొడవు పెరిగే ఈ జీవులు చాలా బలమైనవి. ఒక్కొక్కటి 70 కేజీలకుపైగా బరువు ఉంటుంది. ఇవి తమకంటే పెద్దజీవులైన బర్రెలను కూడా చుక్కలు చూపిస్తాయి. వీటి కాటు విషపూరితం. ఇండోనేసియాలో ప్రస్తుతం 3 వేల కొమొడోలు ఉన్నాయి.