‘133 మంది మృతికి కారణమైన ఆ స్టేడియాన్ని కూల్చేస్తాం’ - MicTv.in - Telugu News
mictv telugu

‘133 మంది మృతికి కారణమైన ఆ స్టేడియాన్ని కూల్చేస్తాం’

October 19, 2022

Indonesia to demolish Malang stadium where stampede killed 133

ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 133 మంది మృతికి కారణమైన ఇండోనేషియాలోని కంజురుహాన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. దేశంలో వచ్చే ఏడాది అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో స్టేడియం కూల్చివేత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, అధ్యక్షుడు విడోడోతో భేటీ అయిన ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ.. దేశంలో ఫుట్‌బాల్‌ను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని కంజురుహాన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజును ఫుట్‌బాల్ చరిత్రలోనే చీకటి రోజుల్లో ఒకటిగా అభివర్ణించిన ఇన్‌ఫాంటినో.. ఫిఫా ప్రమాణాలతో నిర్మించే స్టేడియంలో ప్రేక్షకులు, క్రీడాకారుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇండోనేషియాలో ఫుట్‌బాల్‌ను సంస్కరిస్తామని, మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మే-జూన్ మధ్య జరిగే అండర్-20 ప్రపంచకప్‌ సురక్షితంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుండడంతో అప్పటి వరకు దేశంలో అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.