పెళ్లి చేసుకోవాలంటే ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే.. కొత్త చట్టం  - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి చేసుకోవాలంటే ఆ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే.. కొత్త చట్టం 

November 23, 2019

పెళ్లి చేసుకోవాలంటే ప్రధాన అర్హత వయసే. అటుపై అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి సంబంధం ఫిక్స్ చేస్తారు. లేదంటే ప్రేమ వివాహాలు. ఇలా ఏదైనా పెళ్లీడు వచ్చాకే ఆ తంతు ముగిస్తే ఏ సమస్యా ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓచోట పెళ్లి చేసుకోవాలంటే బాగా చదవాలి.. చదవాలా? ఏం చదవాలని అనుకుంటున్నారా? పైగా ఈ చదువును ప్రభుత్వమే ప్రవేశ పెట్టడం విశేషం. పెద్దల అంగీకారం ఉంది, మంచి ఉద్యోగం, ఇల్లు అన్నీ ఉన్నాయి ఇక పెళ్లికి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు అంటోంది ఆ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నెలల పెళ్లి కోర్సును పూర్తి చేసి, ఆ సర్టిఫికేట్‌ చేతిలో పడ్డాకే పెళ్లి చేసుకోవాలి అంటోంది ఇండోనేషియా సర్కార్. 

పెళ్లి చేసుకోడానికి ముందు ఆదరాబాదరా సంబంధాలు చూడటమో, ప్రేమించుకుని లేచిపోయి పెళ్లి చేసుకోవడమో చేయాలంటే ముందు కచ్చితంగా ఆ కోర్సు పూర్తి చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ ఈ కోర్సును పూర్తి చేసి, పరీక్షలో పాస్ కావాలి. వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను దక్కించుకొనే వ్యక్తులు మాత్రమే పెళ్లికి అర్హులు అవుతారు. ప్రభుత్వం ఈ కోర్సును ఉచితంగానే అందిస్తోంది. ఈ కోర్సులో ఏం బోధిస్తారబ్బా అనే అనుమానం కలుగుతోంది కదూ.. ఈ కోర్సులో సంతానోత్పత్తి, అనారోగ్య నివారణ, పిల్లల సంరక్షణ చిట్కాలు వంటి పాఠాలు చెబుతారంట. 

ఈ కొత్త కోర్సు 2020 నుంచి అమల్లోకి వస్తుందని ఇండోనేషియా హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం వెల్లడించింది. ఈ కోర్సును ఎవరైనా తిరస్కరించినా, పరీక్షల్లో విఫలమైనా.. వారు పెళ్లి చేసుకోడానికి అనర్హులు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించి పెళ్లి చేసుకున్నా.. వారి పెళ్లి చట్టబద్దం కాదు అని చెప్పింది ప్రభుత్వం. ఈ కోర్సు పూర్తిచేస్తే ఆలుమగలు చాలా సఖ్యతగా ఉంటారని.. పిల్లలను సక్రమంగా పెంచి పోషిస్తారని ఇండోనేషియా ప్రభుత్వం ధీమా వ్యక్తంచేస్తోంది. చిత్రంగా ఉంది కదూ.. ఇలాంటి కోర్సు మనదేశంలో కూడా ప్రవేశపెడితే నిత్యపెళ్లికొడుకుల ఆట కట్టినట్టు అవుతుంది కదూ.