జనవరి 25వ తేదీన జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పూజలు చేయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ అమ్మవారిని దర్శించుకుని పట్టుచీర సమర్పించారు. అయితే ఆ చీర ఇప్పుడు.. దుర్గమ్మ సన్నిధిలో ఉండే సిబ్బందికి తలనొప్పిగా మారింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు చీరలు, కానుకలు సమర్పించడం ఆనవాయితీ. అ లా సమర్పించిన చీరెలను అధికారులు వారికి తిరిగి ఇవ్వడమో లేదా సారీ కౌంటర్ కి పంపడమో చేస్తుంటారు. చాలా మంది భక్తులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన తర్వాత.. తాము ఎంత ఖరీదు పెట్టి కొన్నారో.. అంత మొత్తం చెల్లించి తాము దుర్గమ్మకి పెట్టిన చీరను తిరిగి తీసుకెళ్తారు. కొందరు మాత్రం అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలను గుడికే సమర్పిస్తారు. ఇలా వచ్చిన వస్త్రాలను దేవస్థానం ధరను నిర్ణయించి వేలం వేస్తారు. వాటిని భక్తులు డబ్బులు చెల్లించి కొనుక్కుంటారు.
అయితే అమ్మవారికి పవన్ కళ్యాణ్ సమర్పించిన పట్టుచీర కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆలయ సిబ్బందితో పాటు అభిమానులు ఆ చీర కోసం పోటీపడుతున్నారు. మాకు కావాలంటే మాకు కావాలని పట్టిన పట్టువీడకపోవడంతో అధికారులకు ఈ సమస్య తలనొప్పిగా మారింది. అంతేకాక ఈ చీరను చూడటం కోసం రోజుకి పదుల సంఖ్యలో అభిమానులు ఆలయానికి వస్తున్నారని.. ఎక్కడెక్కడి నుంచో తమకు ఫోన్లు చేసి చీర వివరాలు అడుగుతున్నారని శారీ కౌంటర్ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో చేసేది ఏం లేక తిరిగి ఆ చీరను పవన్ కళ్యాణ్‌కే పంపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వారాహిని సిద్ధం చేశారు. జనవరి 25వ తేదీన వారాహికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ముందుగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి అనంతరం విజయవాడ సన్నిధిలో ప్రచార రథానికి పూజ చేశారు. అమ్మవారి సాక్షిగానే వారాహి నుంచి పవన్ తొలిసారిగా మాట్లాడారు.