ఈ జీఎస్టీ పాటను ఇప్పుడే చూడండి.. ఆలస్యం చేస్తే ఇక దొరక్కపోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

ఈ జీఎస్టీ పాటను ఇప్పుడే చూడండి.. ఆలస్యం చేస్తే ఇక దొరక్కపోవచ్చు

November 25, 2017

‘‘జీఎస్టీలా నీవే వచ్చి ఎంత పని చేస్తివే.. మాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే

భూకంపంలా వీధికొచ్చి బొమ్మే చూపి పోతివే.. చూపుల్తో గుణపాలే గుచ్చి గుండె లాక్కుపోతివే..”

త్వరలో విడుదల కానున్న ఇంద్రసేన సినిమాలో ప్రియుడు తన ప్రియురాలిని ఉద్దేశించి మహాపరవశంతో పాడుతున్న డ్యూయట్‌లోని పల్లవి ఇది. ఇందులో జీఎస్టీ.. అదేనండి వస్తు, సేవల పన్నును విమర్శించడం గాని, కేంద్రంలోని మోదీగారి బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టడంగానీ ఉందా? తీపి కోత, గుండె లాక్కుపోవడం..

ఇవన్నీ రొమాన్సులో భాగం కదా. ఇందులో జీఎస్టీని ఆక్షేపించే పదాలేమున్నాయి? అని మనం అనుకోవచ్చు. గాని కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సెన్సార్ బోర్డు మాత్రం అలా అనుకోవడం లేదు. సినిమాలో జీఎస్టీ అనే పదం వినిపిస్తే చాలు కత్తెరకు పదును పెడుతోంది.  

విజయ్ “మెర్సల్” సినిమాలో జీఎస్టీపై పేల్చిన డైలాగులపై ఎంత గొడవ రేగిందో తెలుసుకుందా. చివరికి ఆ డైలాగులను మ్యూట్ చేస్తేగాని కత్తెర బాబులు ఒప్పుకోలేదు. అలాంటిది ‘ఇంద్రసేన’లో జీఎస్టీపై ఏకంగా ఒక పాటే పెడితే ఊరుకుంటారా? అది రొమాన్సులో భాగమైనా, క్రైమ్‌లో భాగమైనా.. అసలెక్కడైనా సరే..  ఆ మాటే ఉండద్దంటోంది బోర్డు.

హీరో విజయ్ ఆంటోని చేస్తున్న ఇంద్రసేన చిత్రంలోని జీఎస్టీ పాటను రవితేజ ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఇంద్రసేనకు ఈ సాంగే ముప్పు తెచ్చింది. దీన్ని తీసేస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు తెగేసి చెప్పింది.

ఇది ప్రేమపాట అని ఎన్ని వివరణలు, సంజాయిషీలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక.. పాట ట్యూన్ అలాగే ఉంచేసి.. జీఎస్టీ స్థానంలో ఈఎంఐ అని పెట్టి మళ్లీ పాడించాలని సినిమా టీమ్ యోచిస్తోంది. ఇంద్రసేనకు జి.శ్రీనివాసన్ దర్శకుడు. ఇది ఈ నెల 30న తమిళ, తెలుగు భాషల్లో వెండితెరలపై రానుంది.

ప్రస్తుతం యూట్యాబ్ లో ఉన్న ఈ జీఎస్టీని పాటను త్వరగా చూడండి. ఆలస్యం చేస్తే యూట్యూబ్ నుంచీ తీసిపారేయెచ్చు పెద్దలు.