సీఏఏ విషాదం.. షాహిన్ బాగ్ చిన్నారి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ విషాదం.. షాహిన్ బాగ్ చిన్నారి మృతి

February 4, 2020

CAA.

పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనల్లో విషాదం చోటు చేసుకుంది. షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. తల్లితో పాటు ఆ దీక్షలో పాల్గొన్న 4 నెలల శిశువు మృతి చెందాడు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జనవరి 30న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బట్లా హౌజ్‌ ప్రాంతంలో నివసించే చిరు వ్యాపారి మహ్మద్‌ ఆరిఫ్‌ భార్య నజియా.. తమ నాలుగు నెలల శిశువు మహ్మద్ ఇర్ఫాన్ జహాన్‌తో పాటు షహీన్‌బాగ్‌ నిరసనలో పాల్గొంటున్నారు. జనవరి 30న ఆందోళనల అనంతరం ఆమె ఇంటికి వెళ్లారు. వారు ప్లాస్టిక్ షీట్లు, వస్త్రాలతో చేసిన చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. రాత్రి బాబును పడుకోబెట్టి తానూ నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున చూసేసరికి ఆ బాబు కదలకుండా విగతజీవిగా పడి ఉన్నాడు. కొడుకు చనిపోవడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఢిల్లీలో చలి తీవ్రత తట్టుకోలేేకే తమ బిడ్డ మరణించాడని.. అయినా తాను వెనక్కి తగ్గేది లేదని నజియా స్పష్టంచేశారు. తన మిగిలిన ఇద్దరు బిడ్డల కోసం నిరసనల్లో పాల్గొంటానని చెప్పారు. ప్రస్తుతం వారికి ఐదేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు.