సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు బ్యాడ్ డేస్ అని ఎక్కువ చేసి చూపించారా..ఇక నో ఓపెనింగ్స్..ఓన్లీ ఊస్టింగ్స్ అంటూ అతిగా భయపెట్టారా..అవుననే అంటోంది దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్..అది ఎలాగంటే..
టెక్కీలు భయపడుతున్నంతగా ఉద్యోగాల కోత ఉండదని ఇస్ఫోసిస్ స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 20000 మంది ఉద్యోగుల నియమిస్తామని తెలిపింది.పనితీరు ఆధారంగా కేవలం 400 మందిని మాత్రమే వెళ్లిపోవాల్సిందిగా కోరామని చెప్పింది. భారీ స్థాయిలో ఉద్యోగాలు కోత కోసినట్టు వచ్చిన వార్తల్ని ఎక్కువ చేసి చూపారని పేర్కొంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తాయని కంపెనీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో 30 నిమిషాల పాటు భేటీ అయిన ఆయన మాట్లాడారు. ‘ఏటా పనితీరు ఆధారం చేసుకుని.. ఉద్యోగులను తొలగించడం అనేది సాధారణ ప్రక్రియే. ఈ సంఖ్య 300- 400 మాత్రమే ఉంది. ఏటా ఈ సంఖ్యలోనే ఉంటుంది’ అని అన్నారు.
కంపెనీ అధిక సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తోందని, కంపెనీ తొలగించే వారి సంఖ్య చాలా తక్కువని స్పష్టం చేశారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ వేతనాల్లో కోత విధించుకుంటే ఐటీ కంపెనీలు యువత ఉద్యోగాలను రక్షించుకోవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలపై స్పందించేందుకు ప్రవీణ్ రావు నిరాకరించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కంపెనీ 10,000 మందిని ఇన్ఫోసిస్ నియమించుకుంది. ఇక ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు భారీ సంఖ్యల ఉద్యోగాలను నియమించుకుంటున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. టీసీఎస్ గత మూడేళ్లలో 2.5 లక్షల నియామకాలు చేపట్టిందని, ఈ ఏడాది 20,000 మందిని నియమించుకోనుందని, మందగమనంపై చర్చలు అనవసరం అని ఆయన చెప్పారు.