ఏపీలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో మరణించిన తమ చిన్నారి మృతదేహంలో ఆ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై 120 కిలోమీటర్లు తరలించారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో నివసిస్తున్న దంపతులు తమ బిడ్డ అనారోగ్యానికి గురి కావడంతో విశాఖలోని కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృత్యువాత పడగా, మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ అడిగితే సిబ్బంది ఇవ్వలేదు. దాంతో చేసేది లేక 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు తమ స్కూటీపై బయల్దేరారు. విషయం తెలుసుకున్న పాడేరు ఆస్పత్రి సిబ్బంది పాడేరు నుంచి స్వగ్రామానికి అంబులెన్స్ సిద్ధం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఇవ్వని ప్రభుత్వ అసమర్ధతను విమర్శించారు. గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.