బెడిసికొట్టిన పథకం.. జీవితఖైదు తప్పలేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

బెడిసికొట్టిన పథకం.. జీవితఖైదు తప్పలేదు..

November 25, 2019

Inmates strangled fellow prisoners to try to land on death row

నేరస్థులు మంచిగా ఆలోచిస్తారు అనుకోవడం భ్రమే అవుతుంది. ఉన్మాదం నిండిన వారి మెదళ్లలోకి మంచి అనేది ఎప్పటికీ రాదు. ‘చంపడం-చావడం’ ఒక్కటే వారికి పరిష్కార మార్గాలుగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు జంట హత్యకేసుల్లో ఇద్దరు జైలుకు వెళ్లారు. వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే వారికి జీవితమంతా జైలులో మగ్గడం కన్నా ఉరిశిక్ష పడితే ఒకేసారి చనిపోతే బాగుంటుంది కదా అనుకున్నారు. అందుకోసం వాళ్లు జైల్లో ఉన్న తోటి నలుగురు ఖైదీలను మట్టుబెట్టారు. కానీ, తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు అయింది వారి పరిస్థితి? కోర్టు వారికి మరో రెండేసి జీవితఖైదులు విధించింది. దీంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది. 

అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన డెన్వర్‌ సైమన్స్(38), జాకోబ్‌ ఫిలిప్ప్‌(28)లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో వారు దోషులుగా తేలారు. విచారణ అనంతరం 2015లో వారిద్దరికి రెండేసి యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.  జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్‌ కరెక్షనల్‌ ఇనిస్టిట్యూట్‌’కు పంపించారు. ఈ శిక్షలో భాగంగా వారికి కనీసం పెరోల్‌ కూడా లభించదు. అది గ్రహించిన వారికి జైలు జీవితం పట్ల విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు.

పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్‌ (44), కింగ్‌  జాన్‌ (52), జిమ్మీ హామ్‌ (56), జాసన్‌ కెల్లీ (35) అనే నలుగురు తోటి ఖైదీలను దారుణంగా హత్య చేశారు. ఖైదీలను చంపిన తమను కోర్టు తప్పకుండా ఉరిశిక్ష వేస్తుందని భావించారు. అయితే ఈ కేసును విచారించిన రిచ్‌మండ్‌ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగిపోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించాలని బాధితుల కుటుంబ సభ్యులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. ఓ పాపాన్ని తుడుచుకుని శాశ్వతంగా వెళ్లిపోదాాం అనుకున్నవారిని ఒకేసారి చంపకుండా క్షణం క్షణం చంపడమే కరెక్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.