తెలంగాణలో జూన్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం వంటి వాటిని చేపడుతున్నారు. అయితే విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఓ పాఠశాల హెడ్ మాస్టర్ వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్థులనూ ఆలోచింపజేసింది.
గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వివిధ తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి హాజరవడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు బుధవారం ఆ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి ఇళ్ల ఎదుట పడుకొని నిరసన తెలుపుతూ.. విద్యార్థులను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. దీనిపై స్పందించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు.. అప్పటికప్పుడు తమ పిల్లలను పాఠశాలకు పంపారు. మిగిలిన విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చే వరకు ఇలాగే చేస్తానని ఆయన చెప్పారు.