Inorbit Mall to be established in Visakha patnam
mictv telugu

వైజాగ్‌లో ప్రతిష్టాత్మక ఇనార్బిట్ మాల్.. నేవీతో కుదిరిన ఒప్పందం

July 8, 2022

ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన విశాఖపట్టణం మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితమైన ప్రముఖ షాపింగ్ సెంటర్ ఇనార్బిట్ మాల్ ఇప్పుడు వైజాగ్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ రహేజా, నౌకాశ్రయ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. నగరంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం సాలిగ్రామపురంలో ఉన్న నౌకాశ్రయ గెస్ట్ హౌస్ స్థలంలో ఈ మాల్ నిర్మించనున్నారు. ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్‌లు శిథిలావస్థకు చేరుకోగా, అధికారులు వాటిని తొలగించి రహేజాకు అప్పగించనున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలాన్ని రహేజా సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు గాను రహేజా సంస్థ రూ. 125 కోట్లు చెల్లించింది. ఈ సందర్భంగా నౌకాశ్రయ చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. ‘ఈ ఒప్పందం వైజాగ్ చరిత్రలో నిలిచిపోతుంది. దీని ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 30 ఏళ్ల లీజు ముగిసిన తర్వాత స్థలంతో పాటు మాల్ కూడా రహేజా సంస్థ అప్పగించాల్సి ఉంటుంది. లీజ్ గడువు ముగిసిన తర్వాత మాల్‌ను నిర్వహించాలనుకుంటే రహేజా సంస్థకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. అప్పుడు స్థలానికి ఉన్న డిమాండ్, నిర్మాణాల విలువ ఆధారంగా లీజు రేటును నిర్ధారిస్తాం’ అని వెల్లడించారు. కాగా, దేశం మొత్తం మీద కేవలం ఐదు చోట్ల మాత్రమే ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. అవి బెంగళూరు, నవీ ముంబయ్, ముంబయ్, వడోదర, సైబరాబాద్. విశాఖలో ఏర్పాటు చేసేది ఆరోది కానుంది.