నోరులేని జీవాలకు సేవచేయడం మా అదృష్టం(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నోరులేని జీవాలకు సేవచేయడం మా అదృష్టం(వీడియో)

March 22, 2020

nvbnbv n

రాయల్ బెంగాల్ టైగర్, నెమళ్లు, తాబేళ్లు, కోతులు, మృగాలు, పాములు, పక్షులు.., ఇలా ఎన్నో నోరులేని జంతువులను చూడాలనుకుంటే టక్కున గుర్తుకువచ్చే పేరు జూపార్క్. హైదరాబాద్‌లోని బహదూర్ పురాలో ఉన్న ఈ పార్కులోని జంతువులను చూడటానికి జనాలు ఎక్కడెక్కడినుంచో తండోపతండాలుగా వస్తుంటారు. అలాంటి జూపార్కులోని జంతువులన్నింటితో మీకు హాయ్ చెప్పించాలని మైక్ టీవీ ఓ వీడియోతో వచ్చింది. ‘Inside The Zoopark’ పేరుతో వచ్చిన ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటికే జూపార్కుకు వెళ్లినవారికి మరోమారు కెమెరా కన్నుతో ఆకట్టుకుంటుంది. చూడనివాళ్లకి మంచి అనుభూతిని మిగిలిస్తుంది. అయితే జూపార్క్ పేరెత్తగానే జంతువులే గుర్తుకు రావడం సహజం. ఆ జంతువుల మంచీచెడ్డా చూసుకునే సేవకుల గురించి చెప్పడానికే ఈ వీడియో చేశాం. ఇందులో జంతువులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సేవకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నోరులేని జంతువులకు ఇలా సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తాం అంటున్నారు. 

నిత్యం వారికి జంతువుల ఆరోగ్యం, వాటికి ఏ సమయానికి ఏం తినిపించాలనేదే వారి రంది. వాటికి ఏది ఇష్టమో అది కనుక్కుని తాజా కూరగాయలు, పండ్లు, మాంసాహారం ఇస్తారు. ప్రతీ జంతువు ఏం తింటుందో వారికి తెలుసు. ఏ సమయానికి పడుకుంటుందో చెప్పేస్తారు. అది కాస్త నీరసంగా ఉందంటే వారి ప్రాణం విలవిలలాడుతుంది. వెంటనే వైద్యుడిని పిలుచుకొచ్చి వాటికి ఇంజెక్షన్ వేయించి దాని ఆరోగ్యం బాగుపడేదాకా ఊరుకోరు. వాటిని ఎల్లప్పుడూ కనిపెడుతూ వాటి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తుంటారు. వీళ్లు చేస్తున్నది ఉద్యోగం కాదు సేవ.. అందుకే వారిని జంతు సేవకులం అనాల్సి వస్తోంది. మూగ జీవాలకు సేవ చేయడం మాకు దక్కిన అదృష్టం అంటున్నారు వారు. వారు తమ సేవకులని ఆ జంతువులకు తెలుసు. అందుకే వారు రాగానే అన్నీ తోకలు ఊపుతూ ఆహారం కోసం అరుస్తుంటాయి. ఒక్కొక్కరు అందులో 20 ఏళ్లనుంచి పనిచేస్తున్నారు. వారికి ఆ జంతువులతో ఉన్న అనుబంధం, ప్రేమ, ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలియాలంటే మీరు ఈ వీడియోను కింది లింకులో చూడాల్సిందే.