నిరుపేదకు ఇల్లు-నాగమల్లు.. మళ్లీ అప్పు చేసి..
జానపద కళాకారుడు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు పాట ఎంత చైతన్యవంతమైందో ఆయన మనసు కూడా అంతకన్నా మెత్తనైంది. పేదవాళ్లను చూస్తే ఆయన హృదయం చలించిపోతుంది. దిక్కులేని వారికి కూడు, గూడును అందించడానికి తను అప్పుల్లో కూరుకుపోయినా పరవాలేదనుకుంటారు. ఓ వైపు బాధ్యతాయుతమైన పోలీస్ ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు నిస్సహాయులకు తన ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా ఆయన సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, చిల్పకుంట్ల గ్రామంలో పంతం లక్ష్మమ్మ (70)కు రెండు గదుల ఇల్లు కట్టించి ఇచ్చారు. లక్ష్మమ్మకు ముగ్గురు కూతుళ్లు. భర్త రామస్వామి పశువులు కాసేవాడు. ఆ కాణీపరకా సంపాదనతో ఇల్లు గడపడమే కాకుండా మిగుల్చుకుంటూ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఎలాగోలా మూడో కూతురు పద్మకు వివాహం జరిపించింది. ఆమెకు మూడేళ్ల పాప ఉంది.
ఆమెకు కూడా భర్త దూరం కావడంతో ఆమె తల్లి వద్దే ఉంటోంది. ముగ్గురు ఆడవాళ్లు కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. లక్ష్మమ్మకు వృద్ధాప్యం వల్ల చూపు తగ్గింది. దీంతో కూతురు ఒక్కతే కూలికి వెళ్లి తెచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. గుడిసెలోకి పాములు, తేళ్లు, కుక్కలు వచ్చినా ఎలాంటి రక్షణా లేకుండా పోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుడిసె పాక్షికంగా ధ్వంసం కావడంతో వర్షానికి, చలికి వణుకుతూ దుర్భరంగా బతుకు సాగిస్తున్నారు. వారి గురించి తెలుసుకున్న నాగమల్లు అండగా నిలబడ్డారు. బ్యాంకు నుంచి రూ. లక్ష అప్పు తీసుకుని రెండు గదుల ఇంటిని నిర్మించి, వారికి కొత్తబట్టలు పెట్టి, కొత్త ఇల్లును వారికి అప్పగించి గృహ ప్రవేశం చేయించారు.
ఎనిమిది నెలల క్రితం కూడా నాగమల్లు సూర్యాపేటలో ఓ పేద కుటుంబానికి గూడు కల్పించారు. తన ఇంట్లోని బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఓ కడుపేదకు నాగమల్లు ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఆ అప్పు తీరకముందే పేదవారి కోసం మరో అప్పు చేశారాయన. ఇదంతా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగితే.. ఆ పేద కుటుంబాల కళ్లల్లో ఆనందం తన మనస్సును కోటీశ్వరున్ని చేస్తోందని ఆయన చెబుతున్నారు.