'ఆర్ఆర్ఆర్‌'లో ఎన్టీఆర్‌కు అవమానం: ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్‌’లో ఎన్టీఆర్‌కు అవమానం: ఫ్యాన్స్

March 28, 2022

0013

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తాజాగా తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాను వీక్షించటం కోసం రాంచరణ్ ఫ్యాన్స్, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధర రెండు వేల నుంచి ఐదు వేల వరకు పెరిగినా, తమ అభిమాన హీరో నటనను చూడటం కోసం ఫ్యాన్స్ వెనక్కి తగ్గకుండా టికెట్లను కొని, సినిమాను చూశారు.

అయితే, సినిమాను వీక్షించిన అనంతరం జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. విడుదలకు ముందు సోషల్ మీడియా వేదికగా విడుదలైన సినిమా ట్రైలర్‌లో, పాటలలో ఎన్టీఆర్‌ను చూస్తుంటే, సినిమాలో ఆయన క్యారెక్టర్, సీన్స్ వేరే లెవెల్‌లో ఉంటాయని తెగ ఆశలు పెట్టుకున్నారు. కానీ, సినిమాను చూశాక పెట్టుకున్న ఆశలు నిరాశలు అయ్యాయని దిగులుపడుతున్నారు. సినిమా మొత్తంలో రాంచరణ్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్సే ఎక్కువగా ఉన్నాయని, జూ.ఎన్టీఆర్ సీన్స్ తక్కువగా ఉన్నాయని, దీంతో తమ అభిమాన హీరో జూ.ఎన్టీఆర్‌కు అవమానం జరిగిందని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా రాంచరణ్‌తో పోల్చితే, ఎన్టీఆర్ పాత్రకు అంత వెయిట్ లేదని, రాజమౌళి రామ్ పాత్రతో సమానంగా భీమ్ పాత్ర తీర్చిదిద్ద లేదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

మరోపక్క దర్శకుడు రాజమౌళి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ బాధపడకూడదని ఎన్టీఆర్‌కి ఒక ఇంట్రో, చరణ్‌కి ఒక ఇంట్రో పెట్టాడు. అలాగే, ఫైట్స్, ఎలివేషన్స్ పంచారు. అయినప్పటికీ ఎన్టీఆర్ పాత్ర చరణ్ పాత్ర ముందు తేలిపోయింది. దీనికి అసలు కారణం విజయేంద్రప్రసాద్ రాసిన కథే. ఆర్ఆర్ఆర్ మూవీలో సన్నివేశాలు సమానంగా పంచినప్పటికీ కథలో ఆత్మ మాత్రం చరణ్‌ని చేశారు. చరణ్ లక్ష్యం స్వాతంత్ర్యం అయితే, భీమ్ లక్ష్యం కేవలం తన జాతికి చెందిన చిన్న పిల్లను కాపాడుకోవడం. చరణ్ పోరాటంలో భాగమైన ఎన్టీఆర్‌కి కథలో ప్రత్యేకత లేకుండా పోవడంతో అనేక విమర్శలకు దారితీస్తుంది.