సీఏఏ అల్లర్లు.. మూక దాడిలో మరో పోలీసు బలి - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏ అల్లర్లు.. మూక దాడిలో మరో పోలీసు బలి

February 26, 2020

caa protest

ఢిల్లీ నెత్తురోడుతోంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఆందోళనకారులు కొట్టుకుని చస్తున్నారు. మధ్యలో కానిస్టేబుళ్లపైనా దాడులకు దిగుతున్నారు. మొన్న రతన్‌లాల్ అనే హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకున్న అల్లరి మూకలు తాజాగా మరో యువ కానిస్టేబుల్‌ను దారుణంగా చంపేశాయి. బుధవారం నాటికి అల్లర్లలో మృతుల సంఖ్య  21కి చేరింది. 180 మందికిపైగా గాయపడ్డారు. 

ఇంటెలిజెన్స్ బ్యూరో‌కు చెందిన అంకిత్ శర్మ(26) కానిస్టేబుల్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా  చాంద్‌బాగ్ వద్ద దుండగులు అడ్డుకుని దాడి చేశారు. తర్వాత మురుగు కాల్వలో పడేశారు. అతని ఒంటిపై తూటా గాయాలు ఉండడంతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అంకిత్ హత్య వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన తండ్రి రవీందర్ శర్మ ఆరోపించారు. తన కొడుకును స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి అనుచరులే చంపారని ఆరోపించారు. రవీందర్ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. తన సోదరుడు నిరసనకారులకు అడ్డుకున్నాడని, అందుకే చంపేశారని అంకిత్ అన్న చెప్పాడు.