పేరుకు మాత్రమే.. - MicTv.in - Telugu News
mictv telugu

పేరుకు మాత్రమే..

February 9, 2018

తెలుగు చిత్ర‌సీమ‌లో  హీరోయిజాన్ని వెండితెర‌పై ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రిస్తుంటారని ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌కు పేరుంది. అదే ఆయ‌న‌కు మాస్ ప్రేక్ష‌కుల్లో తిరుగులేని అభిమాన‌గ‌ణాన్ని తెచ్చిపెట్టింది. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి స్టార్ హీరోలు ఎదురుచూసేలా చేసింది. ఖైదీ  నంబ‌ర్ 150తో మ‌రోమారు బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా ఏమిటో నిరూపించుకున్నారు వినాయ‌క్‌. ఆ సినిమా త‌ర్వాత వినాయ‌క్ తెర‌కెక్కించిన‌ సినిమా కావ‌డం, తొలిసారిగా సాయి ధ‌ర‌మ్‌తేజ్‌తో సినిమా చేస్తుండ‌టంతో ‘ఇంటిలిజెంట్’ కోసం అంద‌రూ ఎదురు చూశారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ప‌లువురు అగ్ర‌ న‌టుల‌కు త‌మ కెరీర్‌లో గొప్ప విజ‌యాల్ని అందించిన వినాయ‌క్ సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు అదే త‌ర‌హా ఫ‌లితాన్ని అందించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఆశించారు. కానీ కానీ వారి క‌ల మాత్రం నెర‌వేర‌లేదు.

సాటివారికి సాయ‌ప‌డాల‌నేది తేజ(సాయి ధ‌ర‌మ్  తేజ్‌) త‌త్వం. విజ‌న్ సొల్యూష‌న్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధిప‌తిగా ఉంటూనే పేద‌వారి కోసం అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను న‌డిపించే నంద‌కిషోర్‌(నాజ‌ర్‌) కంపెనీలో ప‌నిచేస్తుంటాడు తేజ‌. త‌న తెలివితేట‌ల‌కు ఎన్నో పెద్ద కంపెనీలు కోట్ల రూపాయ‌లు జీతం ఇస్తామ‌ని వ‌చ్చినా కాద‌ని ఆత్మ సంతృప్తికోసం నంద‌కిషోర్ సంస్థలోనే ప‌నిచేస్తుంటాడు. నంద‌కిషోర్ చేస్తున్న ప‌నులు ఇత‌ర సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు న‌చ్చ‌వు. అత‌డి కంపెనీని అమ్మ‌మంటూ  నంద‌కిషోర్‌పై ఒత్తిడి తీసుకొస్తారు. అత‌డు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ ప‌నిని మాఫియాడాన్ విక్కీభాయ్‌కి అప్ప‌గిస్తారు. విక్కీభాయ్ అనుచ‌రులు నంద‌కిషోర్‌ను చంపేస్తారు. దాంతో త‌ను న‌మ్మిన వ్య‌క్తికి న్యాయం చేసి అత‌డి ఆశ‌యాల్ని బ‌తికించే బాధ్య‌త‌ను తేజ చేప‌డుతాడు. ధ‌ర్మాభాయ్‌గా పేరుమార్చుకొని విక్కీభాయ్‌తో పాటు అత‌డికి స‌హ‌క‌రిస్తున్న రాజ‌కీయ నాయ‌కుల్ని ఒక్కొక్క‌రిని హ‌త‌మారుస్తూ వ‌స్తాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎదురైన ప‌రిణామాలేమిటి? న‌ంద‌కిషోర్ కూతురు సంధ్య(లావ‌ణ్య‌ త్రిపాఠి)తో అత‌డి ప్రేమాయ‌ణం ఫ‌లించిందా?అన‌్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

గ‌తంలో సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారిన స్నేక్‌గ్యాంగ్ ఆరాచ‌కాలు, జంతుహింస‌తో  పాటు ప‌లు సామాజిక  అంశాల‌కు ప్ర‌తీకార నేప‌థ్యాన్ని ఎంచుకుని తెర‌కెక్కించిన క‌మ‌ర్షియ‌ల్  ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.త‌న‌ను న‌మ్ముకున్న కుటుంబానికి ఓ యువ‌కుడు ఎలా న్యాయం చేశాడ‌నే పాయింట్‌ను తీసుకుని  దానికి యాక్ష‌న్, హీరోయిజం, మాస్ హంగుల‌ను జోడించి త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు వినాయ‌క్‌. అత‌డు చెప్పాల‌నుకున్న పాయింట్ చిన్న‌ది కావ‌డం, సినిమాగా తెర‌కెక్కించే అంతా గొప్ప‌ది కాక‌పోవ‌డంతో సినిమా ఆద్యంతం ప‌క్కదారి ప‌ట్టింది. మంచివాడుగా హీరోను చిత్రీక‌రించే స‌న్నివేశాలు, స్నేహితుల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే వ్య‌క్తిత్వ‌మున్న వాడిగా చూపించే స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. క‌థ‌లో కీల‌క‌మైన ధ‌ర్మాభాయ్ ఏపిసోడ్‌కు వ‌చ్చేస‌రికి చేతులేత్తేసారు. ఎప్ప‌టిదో 1990 కాలం నాటి ఫార్ములాను అనుస‌రించారు.

గ‌తంలో వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఠాగూర్‌తో పాటు యువ‌సేన, కిక్‌తో పాటు ప‌లు సినిమాల్ని ఈ క‌థ గుర్తుకుతెస్తుంది. త‌న ఆచూకీ శ‌త్రువుల‌కు తెలియ‌కుండా హీరో వారిని ఫూల్స్ చేయ‌డం, త‌న బ‌దులు క‌మెడీయ‌న్‌ల‌ను ఇరికించి ఇబ్బందులు పెట్ట‌డం లాంటి అంశాల‌తో కాలక్షేపం చేయ‌డం చూస్తుంటే ఇది వినాయ‌క్ సినిమానేనా అన్న అనుమానం క‌లుగుతుంది. హీరో ధ‌ర్మాభాయ్‌గా మార‌డం,  విల‌న్‌ను ప‌ట్టుకోవ‌డానికి అత‌డు వేసే ఎత్తులు,వారిద్ధ‌రి పోరు ఏ ఒక్క అంశంతోనూ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేడు. వినాయ‌క్ సినిమాల్లో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసే భావోద్వేగాలు, రొమాంచితంగా సాగే పోరాట ఘ‌ట్టాలేవి ఇందులో ఒక్క‌టీ కాన‌రాదు. ఓ పాట, ఫైట్ ఇలా ఒక‌దానినొక‌టి పేర్చుకుంటూ పోయిన‌ట్లుగా అనిపిస్తుంది. క‌థ‌నేది లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా  అలాగే ఉంది. దాంతో వినాయ‌క్ ఏమీ చేయ‌లేక‌పోయారు.  క‌థ బాగా లేక‌పోయినా హీరోహీరోయిన్ల ప్రేమ‌నైనా స‌రిగా చూపించారా అంటే అది లేదు. కేవ‌లం డ్రీమ్‌సాంగ్‌లకే క‌థానాయిక‌ను ప‌రిమితం చేశారు. ఆకుల శివ క‌థ‌లో కొత్త‌ద‌నం అనేది ఎక్క‌డా క‌నిపించ‌దు. గ‌తంలో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్ని క‌ల‌గ‌ల‌పి త‌యారుచేసుకున్నారు. ప‌తాక ఘ‌ట్టాలు పూర్తిగా నిరాశ‌ప‌రుస్తాయి.

తేజ అనే స‌గ‌టు యువ‌కుడిగా, ధ‌ర్మాభాయ్‌గా భిన్న పార్శ్వ‌ల్తో సాయి ధ‌ర‌మ్‌తేజ్ పాత్ర సాగుతుంది. ల‌వ‌ర్‌బాయ్ వ‌ర‌కు ఒకే అనిపించినా ధ‌ర్మాభాయ్‌గా మాత్రం తెలిపోయారు. ఆ పాత్ర చిత్ర‌ణ బ‌లంగా లేక‌పోవ‌డం, దానిని తెర‌పై శ‌క్తివ‌తంగా ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో  ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. చాలా చోట్ల చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శైలిల‌ను అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశారు సాయి ధ‌ర‌మ్‌తేజ్‌. అవి కొంత‌వ‌ర‌కు ఓకే అయినా సినిమా  స‌క్సెస్‌కు మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేవు. ఆ విష‌యాన్ని అత‌డు ఎంత తొంద‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది. త‌న బాడీలాంగ్వేజ్‌కు త‌గ్గ క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే అందుకు త‌గిన మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు.

లావ‌ణ్య త్రిపాఠి పాత్ర కేవ‌లం పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. నాజ‌ర్‌, రాహుల్‌దేవ్‌, ఆకుల‌శివ‌, దేవ్‌గిల్ ఇలా సినిమాలో చాలా మంది  ఉన్నా హ‌డావిడి త‌ప్ప అస‌లు  విష‌య‌మేది ఉండ‌దు. బ్రహ్మానందం  గ‌తంలో చాలాసార్లు తాను న‌టించిన  పాత్ర‌లోనే మ‌రోసారి క‌నిపించాడు. గ‌తంలో ఓ యువ‌కుడు కుక్క‌ను కొట్ట‌డంతో జంతుప్రేమికులు సామాజిక మాధ్య‌మాల్లో చేసిన హంగామాను కామెడీగా ఈ సినిమాలో చూపించారు వినాయ‌క్. ఆ ఎపిసోడ్‌ల‌న్నీ ప్రేక్ష‌కుల ఓపిక‌కు ప‌రీక్ష‌గా నిలిచాయి.

సాంకేతికంగా ఈ విభాగం బాగుంది అని చెప్పుకునేది ఏదీ లేదు. చ‌మ‌క్‌చ‌మ‌క్ చ‌మ్ పాట రీమిక్స్ చేసి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాల‌ని చిత్ర‌బృందం చేసిన ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది. అందులో సాయిధ‌ర‌మ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి చేసిన నృత్యాలు స‌రిగ్గా కుద‌ర‌లేదు. క‌ళామందిర్ చీర పాట మాత్ర‌మే కొంత‌వ‌ర‌కు మాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

ఇంటిలిజెంట్ పేరులోనే త‌ప్ప సినిమాలో క‌నిపించ‌దు. క‌థ‌, క‌థ‌నాల‌పై దృష్టిసారించ‌కుండా వినాయ‌క్ ఈ సినిమా చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కుల్ని అభిరుచుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ త‌దానుగుణంగా ప్ర‌తిభ‌కు  ప‌ద‌నుపెట్ట‌క‌పోతే ఎలాంటి ఫ‌లితాలు ఎదుర‌వుతాయో చెప్ప‌డానికి ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు మ‌రోసారి నిరాశ‌నే మిగిల్చింది. మెగా అభిమానుల్ని సైతం ఈ సినిమా మెప్పించ‌డం క‌ష్ట‌మే.

రేటింగ్‌: 2/5