ముదురుతున్న నీటి కొట్లాట.. కేంద్రానికి జగన్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ముదురుతున్న నీటి కొట్లాట.. కేంద్రానికి జగన్ లేఖ

August 11, 2020

Intensifying water war between Telugu states .. Jagan's letter to the Center.

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాను పెంచుతున్నట్టుగానే ఉంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ఇటీవల కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాసిన లేఖపై ప్రత్యుత్తరం పంపారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా సిద్ధం చేశామని.. మాట్లాడేందుకు రాష్ట్రం తరఫున సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏపీ నుంచి స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని జగన్‌ స్పష్టంచేశారు. 

కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని.. కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. 2015లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతలు చేపట్టామని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని.. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని వివరించారు.