Intention was not to target the public: Uttarakhand BJP chief Mahendra Bhatt
mictv telugu

జాతీయ జెండా లేని ఇళ్లను ఫోటో తీయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

August 13, 2022

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌కు పిలుపు ఇచ్చింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబం తమ ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని బీజేపీ ఈ క్యాంపెయిన్‌ను విస్తృతం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అందరూ ఆచరించాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్నారు. అంతటితో ఆగకుండా జాతీయ జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయాలని పిలుపు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు మండిపడ్డాయి.ఈ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ రోజు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు అందరికీ వర్తించవని, కేవలం బీజేపీ వర్కర్లకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును పార్టీ కార్యకర్తలు అందరూ పాటించాలనేదే తన అభిలాష అని, జాతీయ జెండా ఎగరేయకుంటే వారి ఇంటి ఫొటో తీయాలని కోరానని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎవరిని అవమానించడం, అనుమానించడం తన ఉద్దేశం కాదన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడంలో ఎవరికైనా ఏమి ఇబ్బంది ఉంటుందన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాజకీయం చేస్తోందని ఆరోపించారు.