కులాంతర వివాహాలతో ఆరోగ్యం పదిలం  - MicTv.in - Telugu News
mictv telugu

కులాంతర వివాహాలతో ఆరోగ్యం పదిలం 

November 24, 2020

upper lower

మన దేశం ఎందుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, కులవివక్ష. వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. పేదరికం నానాటికీ పెరుగుతోంది. కులవివక్షకు ఎంతో మంది బలవుతున్నాయి. కులాంతర వివాహాలను మన కరడుగట్టిన కుల సమాజం జీర్ణించుకోవడం లేదు. ఈ పెళ్లిళ్లతో పరువు పోతుందని పెద్దలు దారుణాలకు ఒడిగడుతున్నారు. 

పరువు సంగతి పక్కనబెడితే.. కులాంతర పెళ్లిళ్లు ఆరోగ్యానికి, భావితరాలకు మేలు చేస్తాయని వైద్య పరిశోధనలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త డేవిడ్ రీచ్ రాసిన పుస్తకంలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. Who We Are and How We Got Here అనే పుస్తకంలో భారతీయుల జన్యువులు, డీఎన్ఏ తదితర అంశాల విశ్లేషణను ఆయన పొందుపరిచారు. తంగరాజ్, మూర్జానీ తదితర శాస్త్రవేత్తల విశ్లేషణలను కూడా వాడుకున్నారు. 

పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఒక కులం లోపల పెళ్లిళ్లు శతాబ్దాల తరబడి సాగితే జన్యువైవిధ్యం లేక వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. భారతీయుల్లో అత్యధిక శాతం మంది ప్రాచీన ఉత్తర భారతీయ(ఏఎన్ఐ), ప్రాచీన దక్షిణ భారతీయ(ఏఎస్ఐ) వర్గాలకు చెందిన వారు. అగ్రవర్ణాలు, ఉత్తర భారతీయుల ఎక్కువగా ఏఎన్ఐ విభాగంలో ఉన్నారు. 4 వేల ఏళ్ల కిందట ఏఎన్ఐ, ఏఎస్ఐల మధ్య పెళ్లిళ్లు జరిగేవి కావు. తర్వాత కాలంలో వాటి మధ్య వివాహ సంబంధాలున్నాయి. 

అయితే 2 వేల ఏళ్ల నుంచి అంటే.. 70 తరాల కిందట అవి ఆగిపోయాయి.  కులాల అవతరణే దీనికి కారణం. దీంతో దళితుల జన్యువులు భిన్నంగా మారాయి.కులంలోపల పెళ్లిళ్లు, సమీప బంధువులతో పెళ్లిళ్ల వల్ల జన్యవైవిధ్య కొరవడి కొన్ని సమూహాల్లో నాడీసంబంధ  జన్యుసంబంధ వ్యాధులు మొదలయ్యాయి. ఇది భారతదేశంలోనే కాకుండా కులపెళ్లిళ్లు పాటించే అస్కెనాజి యూదుల్లోనూ కనిపిస్తుంది. భారత దేశంలో కులపెళ్లిళ్ల సమూహాలు చాలా ఉండడంతో వ్యాధులు కూడా ఎక్కువుండే అవకాశముంది. మన దేశంలో జరిగే పెళ్లిళ్లలో కులాంతర పెళ్లిళ్లు కేవలం 5 నుంచి 6 శాతం మాత్రమే. వీటిని పెంచడం వల్ల అటు కులవివక్షను అరికట్టడమే కాకుండా ఇటు ఆరోగ్యం కూడా చేకూర్చినట్లు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.