ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమ బోర్డుగా మారుస్తాం... - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమ బోర్డుగా మారుస్తాం…

August 22, 2017

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇప్పటికే దేశంలో బెస్ట్ డిజిటలైజ్డ్ బోర్డుగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు లభించింది. ఇందుకు కృషి చేసిన ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు. అయితే ఇంతటితో సంతృప్తి చెందకుండా మరింత కష్టపడాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు 2వ సమావేశంలోకడియం శ్రీహరి పాల్గొని బోర్డు ప్రవేశపెట్టిన పలు తీర్మాణాలను ఆమోదించారు.

ఇంటర్ బోర్డు సర్వ సభ్య సమావేశం ప్రతీ ఆరు నెలలకొకసారి జరగాల్సి ఉండగా రాష్ట్ర విభజన, బోర్డు పదో షెడ్యూల్ లో ఉన్నందున నిర్ణీత సమయంలో సమావేశం నిర్వహించలేకపోయామని, ఇకనుంచీ ప్రతీ ఆరు నెలలకొకసారి ఇంటర్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరుగుతుందన్నారు. అదేవిధంగా బోర్డు సభ్యులను కూడా ప్రస్తుత అవసరాల మేరకు మార్చుతామన్నారు. వృత్తివిద్య కోర్సులను మరింత పటిష్టం చేసి, కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ వచ్చే విధంగా కోర్సులను డిజైన్ చేస్తామన్నారు. ఇందుకోసం జేఎన్టీయు, వైద్య, ఆరోగ్య శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ కమిటీ తన నివేదిక ఇవ్వాలని, దానికనుగుణంగా కోర్సులు రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామన్నారు. అదే సమయంలో ఆదరణలేని వృత్తివిద్యా కోర్సులను కూడా తొలగిస్తామని చెప్పారు.

బోర్డు పరిధిలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయని, వీటిన్నింటిలో ఉన్న వసతులు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలతో ఒక్కో కాలేజీకి ఒక్కో ప్రొఫైల్ తయారు చేయిస్తామన్నారు. వాటిని ఇంటర్ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని, తద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులు ఏయే కాలేజీల్లో ఎలాంటి కోర్సులు, వసతులు ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుమతుల్లో బోర్డు కఠినంగా ఉంటుందన్నారు. సరైన వసతులు లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఈ క్రమంలో బోర్డుపై ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. గతంలో ప్రైవేట్ కాలేజీలు బోర్డును ఆజమాయిషీ చేసేవని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ కాలేజీలపై బోర్డు పట్టు సాధించిందన్నారు. నిబంధనల మేరకు నడవని ప్రైవేట్ కాలేజీల నుంచి భారీ ఎత్తున ఫెనాల్టీలు కూడా వసూలు చేశామన్నారు.

తెలంగాణలో ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు చేశామన్నారు. ఇంటర్ విద్యను ఉచిత విద్య చేశామని, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నామని, అదేవిధంగా 325 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 404 కాలేజీల్లో ల్యాబ్స్, లైబ్రరీలు, మౌలిక వసతులు కల్పించామన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలన్నింటికీ పక్కా భవనాలు ఏర్పాటు మరియు ప్రతీ కాలేజీలో సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డులో 22 సర్వీస్ లను ఆన్ లైన్ చేశామని, త్వరలో మరిన్ని సేవలను కూడా ఆన్ లైన్ చేస్తామన్నారు. ఇంటర్ బోర్డును దేశంలోనే ఉత్తమమైన బోర్డుగా తీర్చిదిద్దుతామన్నారు.

విద్యాశాఖ చేపట్టిన పలు సంస్కరణల వల్ల జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగడమే కాక మూడేళ్ల కింద ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,23,000వేల మంది విద్యార్థుల నమోదు ఉంటే, ఈ ఏడాది ఈ సంఖ్య 1,80,000వేలకు చేరుకుందన్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాలేజీలు పటిష్టమవుతున్న నేపథ్యంలో కాలేజీల ఏర్పాటుకు డిమాండ్ పెరుగడమే కాకుండా ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రికి విజ్ణప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ జూనియర్ కాలేజీలు అవసరమో గుర్తించి, వచ్చే ఏడాది అక్కడ కొత్త కాలేజీలను మంజూరు చేస్తామని తెలిపారు. మొత్తానికి ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలనే వాతావరణం కల్పించే దిశగా కృషి జరుగుతోందన్నారు.