కరోనా వస్తుందిరా అన్నా పట్టుకుంటున్నారు.. అలుగు చర్మాల రాకెట్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వస్తుందిరా అన్నా పట్టుకుంటున్నారు.. అలుగు చర్మాల రాకెట్ 

August 4, 2020

Inter-state pangolin poaching racket busted in Telangana's Bhadradri Kothagudem, 12 arrested.

కరోనా వస్తుందిరా అన్నా వినిపించుకోకుండా అడవి జంతువులైన అలుగులను అన్యాయంగా చంపుతున్నారు. వాటి చర్మాలు ఒలిచి స్మగ్లింగ్ చేసుకుంటున్నారు. దేశంలో అలుగు చర్మానికి, మాంసానికి డిమాండ్ ఉండటంతో.. అలుగు స్మగ్లింగ్ బాగా పెరిగిపోతోంది. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సినీఫక్కీలో సదరు వేటగాళ్లను పట్టుకున్నారు. డబ్బు ఆశజూపి భద్రాచలం అడవుల్లో నివసించే ఆదివాసుల నుంచి అలుగు చర్మాలను సేకరిస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది.  హైదరాబాద్‌ సహా కొత్తగూడెం, భద్రాచలం, ఏపీ, ఒరిస్సాలలో అధికారులు వేటగాళ్ల ఆపరేషన్‌ నిర్వహించారు. అటవీశాఖ అధికారులు తాము అలుగు చర్మాన్ని కొంటామని నమ్మించి 12 మంది నిందితులను పట్టుకున్నారు.  

మొదట కొత్తగూడెం అటవీశాఖ అధికారులు కొత్తగూడెం జిల్లా సుజాతానగర్‌కు చెందిన  బాదావత్‌ రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం అతను ఇచ్చిన సమాచారంతో నిఘా పెట్టి మిగతా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారితో పాటు అస్సాం, ఒరిస్సా, బెంగాల్‌‌కు చెందిన సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో వేటాడి చంపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.