తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్, ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.ఇక గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.. సభలో ఈటలను చూసిన కేటీఆర్..అన్నా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సరదాగా మాట్లాడారు. ఇటీవల హుజురాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు హాజరుకాలేదంటూ ఈటలను కేటీఆర్ అడిగారు. పిలిస్తే కదా వచ్చేది అంటూ ఈటల సమాధానం మిచ్చారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదంటూ కేటీఆర్కు ఈటల హితవు పలికారు. కనీసం కలెక్టర్ల నుంచైనా ఆహ్వానం ఉండాలన్నారు.
ఆదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్కమార్క అక్కడకు వెళ్లారు. తనకు కూడా ప్రభుత్వ సమావేశాలకు సమాచారం అందడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజాసింగ్ వేసుకున్న కాషాయ రంగుపై కేటీఆర్ సరదా కామెంట్స్ చేశారు. చొక్కా కలర్ కళ్లకు గుచ్చుకుంటుందని..తనకు ఆ రంగు నచ్చదని వ్యాఖ్యానించారు. కాషాయా రంగు చొక్కా భవిష్యత్‌లో మీరు వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ అన్నారు. ఇదే సమయంలో గవర్నర్ రావడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేటీఆర్ కంటే ముందు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వచ్చి ఈటలతో మాట్లాడారు.