ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.మొత్తం 9 రోజులు పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 16వ తేదీన గురువారం రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా లాబీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇద్దరు ఎదురు పడిన సమయంలో అప్యాయంగా పలకరించుకొని సరదాగా మాట్లాడుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ పయ్యావుల కేశవ గెలవాలని కోరుకుంటున్నానని పేర్నినాని వ్యాఖ్యానించారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్‌ను ఆయన గుర్తు చేశారు. పేర్నినాని వ్యాఖ్యలకు పయ్యావుల సరదాగా కౌంటరిచ్చారు. నో డౌట్ 1994 ఫలితాలు.. 2024లో రిపీట్ అవుతాయని తెలిపారు.1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచిందని.. రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టు టీడీపీ, వైసీసీ తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు, లోకష్‌తో పాటు టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తుంటే..టీడీపీకి వైసీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో పేర్నినాని, పయ్యావులు సరదాగా మాట్లాడడం చర్చనీయాంశమైంది.