Interesting Incident Happened In Srikalahasti Temple
mictv telugu

కాళహస్తిలో అద్భుతం.. దేవుని మహిమేనంటున్న భక్తులు

September 22, 2022

నాగుల చవితి నాడు.. పుట్ట వద్ద పాములు కనిపించడం, వినాయక చవితి ఉత్సవాల సమయంలో మండపాల వద్ద ఎలుకలు వచ్చి ప్రసాదాలు తినడం.. ఇదంతా దేవుని మహిమగా చెప్పుకుంటారు కొందరు భక్తులు. అలాంటి వింత సంఘటన ఒకటి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుడి ఉత్సవంలో ఓ అద్భుతం జరిగిందంటూ భక్తులు చెబుతున్నారు. కాలభైరవుని పూజల అనంతరం స్వామి వారిని మేళతాళాల మధ్య బయటికి తీసుకుని వచ్చి కంచి గడప దగ్గర ఉంచారు. ఆ సమయంలో అక్కడున్న ఆకాశ నంది ధ్వజ స్తంభానికి ఉన్న నాలుగు గొలుసులలో ఒక గొలుసు మాత్రమే మేళ తాళాలు మోగిస్తున్నంతవరకు నృత్యం చేస్తున్నట్లు తిరుగుతూ కనిపించింది. ఇది చూసిన భక్తులంతా అంతా భగవంతుని మహిమ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఆశ్చర్యకరంగా ఆ ధ్వజ స్తంభానికి ఉన్న నాలుగు గొలుసుల్లో ఒక్కటి మాత్రమే ఊగుతున్నట్లు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ గొలుసు ఒకవేళ గాలికి ఊగిందా అనుకుంటే మిగతా మూడు గొలుసులు కూడా తిరగాలి. కానీ.. ఒక గొలుసు మాత్రమే మేళతాళాలకు నృత్యం చేస్తోందా అన్నట్లుగా తిరుగుతూ ఉంది. ఈ వీడియోను చూసిన వారంతా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఏదైనా గ్రావిటీ ఫోర్స్ వల్ల ఇలా జరిగి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.