INTERNATIONAL MEN’S DAY SIGNIFICANCE
mictv telugu

మగాళ్లూ మీకు జోహార్లు!

November 19, 2022

దెబ్బ తగిలినా, ఎవరికేమైనా అమ్మ కండ్ల నుంచి నీళ్లను చూస్తాం. అదే నాన్న మాత్రం గుంభనంగా ఉండిపోతాడు. మగవాళ్లంటే ఇలాగే ఉండాలని సమాజం నిర్ణయించింది. కానీ మగవాడికీ ఒక మనసు ఉంటుంది. అది కూడా ఏడుస్తుందని గమనించరు. ఆడవాళ్ల మీద ఉన్న సానుభూతి మగవాడికి కరువే. ఎన్నో సమస్యలున్నానవ్వుతూ తిరిగే ఆ మగవారికే ఈ రోజు. వారందరికీ ప్రత్యేకంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. యూకేలో మాత్రం మగవాళ్ల ఆత్మహత్యల మీద ఈ రోజును జరుపుతుంటారట. అక్కడ ఆడవాళ్లకంటే మూడు శాతం ఎక్కువ ఆత్మహత్యలు మగవాళ్లు చేసుకుంటున్నారు. భారతదేశంలో 2007 నుంచి ఈ రోజును జరుపుతున్నారు. ఉమా చుల్లా అనే అడ్వకేట్ మగవాళ్లు అనుభవిస్తున్న మానసిక సమస్యలను ఆధారం చేసుకొని ఈ రోజును జరుపాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి భారతదేశంలో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

ఎలా మొదలు..
1968లో అమెరికన్ కాలమిస్ట్.. జాన్ పి. హారిస్ ఒక ఆర్టికల్ రాశాడు. మహిళలు వారి చేసే కష్టాన్ని గుర్తించి ఉమెన్స్ డేని జరుపుతున్నారు. అదే మగవాడి కష్టాన్ని మాత్రం విస్మరిస్తున్నారనేది ఈ కథనం. మొదట ఇక్కడ మెన్స్ డే ఉండాలని అనడానికి బీజం పడింది. కానీ అది అలా కొనసాగలేదు. 90వ దశకంలో థామస్ ఒస్టర్.. మిసోరీ సెంటర్ ఫర్ మెన్స్ స్టడీస్లో పనిచేసేవాడు. ఆయన యూఎస్, ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ మెన్స్ డేని ఫిబ్రవరిలో జరిపేవాడు. ఐదు సంవత్సరాలు కొనసాగించాడు. ఆ తర్వాత 99లో జెర్మో అనే వెస్టిండీస్ విద్యార్థి మెన్స్ డే అంటూ ఉండి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు తన తండ్రే ఆదర్శం. ఆయన పుట్టినరోజు నవంబర్ 19న. అలా మెన్స్ డేని నవంబర్ 19గా జరుపడం మొదలుపెట్టాడు. అలా.. అలా ఈ మెన్స్ డే నవంబర్ 19న జరుపుతున్నారు.

ఎందుకు జరుపాలి?
చాలామంది ఈ పురుషుల దినోత్సవం ఎందుకు జరుపాలని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. వారికి సమాధానం ఏంటంటే.. ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు కూడా చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఈ సందర్భంగా బయట పెట్టాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మగవాళ్ల ఆరోగ్య సమస్యలు, రోజు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్పాలి. మగవాళ్లు బయటకు చెప్పకుండా తమలో తామె నలిగిపోతుంటారు. దానివల్ల వాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగానైనా వారు ఓపెన్ అవ్వాలి. అంతేకాదు.. యువకులు, పిల్లలు చాలా వరకు తమ అభిప్రాయాలు చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. వారికి అందరూ మార్గనిర్దేశం చేయాలి. ఈ రోజు అందుకు పునాది కావాలి.

ఈ సంవత్సరం..
ప్రతీ సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. పురుషుల ఆరోగ్య సమస్యలు, శారీరక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలను ఇందులో హైలైట్ చేస్తుంటారు. అంతేకాదు.. పురుషుల పట్ల వివక్ష సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళికలు చేస్తుంటారు. గతేడాది ‘స్త్రీ పురుషల మధ్య మెరుగైన సంబంధాలు’ అనేది థీమ్. ఈ సంవత్సరం ‘అబ్బాయిలు, పురుషులకు అన్ని రకాలుగా సహాయం చేయడం’ అంటున్నది ఈ దినోత్సవం ప్రధాన థీమ్.

మీకు తెలుసా?
_ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల కంటే మగపిల్లలు బాల్యంలో చనిపోయే అవకాశం 25శాతం ఎక్కువ.
‌‌ _ పురుషుల ఆయుర్దాయం 64.52 సంవత్సరాలు, స్త్రీల ఆయుర్దాయం 68.76 సంవత్సరాలు.
_ పురుషుల మెదడు స్త్రీల కంటే 10శాతం పెద్దది.
‌‌ _ సగటు పురుషుడు స్త్రీల కంటే50శాతం తక్కువ కొవ్వు, 50శాతం ఎక్కువ కండరాలను కలిగి ఉంటాడట.
‌‌ _ అబ్బాయిలు ఆటిజంతో బాధపడే అవకాశం 3 నుంచి 4రెట్లు ఎక్కువ.
_ అమ్మాయిలే అబద్ధాలు చెబుతారనుకుంటారు. కానీ మగవాళ్లు ఆడవాళ్ల కంటే రెండు రెట్లు ఎక్కువగానే అబద్ధాలు చెబుతారు.
_ మహిళల కంటే పురుషులు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు.
‌‌ _ కెరీర్లో, జీవితంలో విజయం సాధించడానికి అబ్బాయిలు ఎక్కువగా కృషి చేస్తారు.
‌‌‌_ ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 100మంది ఆడపిల్లలకు 107మంది అబ్బాయిలు జన్మిస్తున్నారు.