International music fest in Kerala
mictv telugu

మ్యూజిక్ లవర్స్…ఛలో కేరళ

November 7, 2022

పాట…ఆనందం,పాట…ఒక సాంత్వన, పాట…ఒక మత్తు, పాట….ఒక వేదన, ఒక ఓదార్పు. సంగీతానికి ఉన్న మహిమ దేనికీ లేదు. చిన్న పల్లల నుంచీ పెద్ద వాళ్ళ వరకూ పాటలను, సంగీతాన్ని ఇష్టపడని వారు ఉండరు. ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు వినే పాటలు, మ్యూజిక్ వేరే ఉండవచ్చు గానీ దానిని వినని వారు ఉండడం మాత్రం చాలా అరుదే. మనలోని బాధలను పోగొట్టి మన జబ్బులను కూడా మ్యూజిక్ తగ్గిస్తుంది అంటారు.

మనం రోజూ వినే పాటలు, సంగీతం వేరు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కో, షో కో వెళ్ళి మ్చూజిక్ ను ఎంజాయ్ చేయడం వేరు. ఈ ప్రోగ్రామ్, షోలు మనకు తెలియని లోకాలకు మనల్ని లాక్కుని వెళతాయి. మనకు తెలియని కొత్త సంగీతాన్ని మనకి పరిచయం చేస్తాయి. మనలోని కొత్తదనాన్ని తట్టిలేపుతాయి. అలాంటి మ్యూజిక్ ప్రోగ్రామ్లకు, షోలకు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా వెళితే బావుంటుంది. లైవ్ లో సంగీతం వింటుంటే వచ్చే ఆ మజానే వేరు. అలాంటి అనుభూతిని మీరూ పొందాలనుకుంటున్నారా. అయితే ఇంకెందుకు ఆలస్యం….వెంటనే కేరళకు టికెట్లు బుక్ చేసేసుకోండి. అక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్ట్ లో మీరు భాగం అయిపోండి. సంగీత తరంగాలలో తేలిపోండి.

అంతర్జాతీయ సంగీతోత్సవం…

కేరళలో ఈ వారం అంతర్జాతీయ సంగీతోత్సవం జరగనుంది. అక్కడున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కోవలంలో నవంబర్ 9 నుంచి 13 వరకు ఈ ఉత్సవం నిర్వహించనున్నారు. దీనికోసం కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించిన కోవలాన్ని భారీగా ముస్తాబు చేశారు కూడా. ఐదు రోజుల పాటూ జరిగే ఈ మ్యూజిక్ ఫెస్ట్ లో మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫేమస్ బ్యాండ్ లు పాల్గొంటున్నాయి.

ఈ అంతర్జాతీయ ఇండీ సంగీతోత్సవం కేరళలోనే కాకుండా భారతదేశంలోనే మొదటిసారి జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమం కేరళలో జరిగే వార్షిక సంగీత ఉత్సవానికి కూడా నాంది పలుకుతోంది. ఈ ఫెస్ట్ లో మొత్తం 21 మ్యూజిక్ బ్యాండ్లు ప్రదర్శన చేయనున్నాయి.ఈ సంగీతోత్సవంలో 7 అంతర్జాతీయ బ్యాండ్‌లు, గాయకులు కనిపిస్తారు. అందులో ప్రధానంగా UK నుండి విల్ జాన్స్ అండ్ సామి చోఫ్ఫీ, మలేషియా నుండి లియా మెటా, పాపువా న్యూ గినియా నుండి అన్స్‌లోమ్, సింగపూర్ నుండి రుద్ర, ఇటలీ నుండి రోక్ ఫ్లవర్స్ వంటి స్టార్లు ప్రదర్శన చేయనున్నారు.

భారత్ నుంచి ఎవరెవరు?

ఇక భారత్‌ నుంచి 14 సంగీత బృందాలు పాల్గొంటున్నాయి. ముంబైకి చెందిన షెరీస్, ఆర్‌క్లిఫ్, వెన్ చై మెట్ టోస్ట్, హరీష్ శివరామకృష్ణన్, స్క్రీన్ 6, సితార కృష్ణకుమార్ ప్రాజెక్ట్ మలబారికస్, ఊరాలి, జాబ్ కురియన్, కెయోస్, లాజీ జె, చందన రాజేష్, దేవరాస్సేరి చురం, ఇన్నర్ శాంక్టమ్ ఏకాంబరం ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భారతదేశంలోనే మొట్టమొదట ఫెస్ట్ కాబట్టి ఓ కొత్త కల్చర్ కు ఇది ప్రారంభం కానుందని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాల తరహా మ్యూజిక్ కల్చర్ ఇక్కడ కూడా అభివృద్ధి చెందడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

సంగీతప్రియులకు ఈ ఫెస్ట్ మంచి వీనుల విందే అని చెప్పాలి. దేశీ సంగీతంతో పాటూ విదేశీ మ్యూజిక్ కూడా రాక్ చేయనుంది కాబట్టి ఫెస్ట్ జరిగే ఐదు రోజులూ సంగీతంలో మునిగి తేలడం ఖాయం. దాంతో పాటు గాడ్స్ ఓన్ సిటీ అయిన కేరళ అందాలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మంచు లేకుండా వింటర్ ను ఎంజాయ్ చేయాలంటే కేరళ మంచి ప్లేస్. దానికి ఇదే కరెక్ట్ టైమ్ కూడా. ఒక వారం రోజులకు సరిపడా టూర్ ప్లాన్ చేసుకుంటే చెవులకు, కళ్ళకు మంచి విందు, మనకు ఆహ్లాదం, ఉత్తేజం కూడా దొరుకుతాయి. ఏడాది మొత్తం చేసిన పనిని, స్ట్రెస్ ను పోగొట్టుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం కచ్చితంగా లభించదు.