గవర్నర్ హోదాలో ఉన్న తనను తీవ్ర పదజాలంతో దూషించిన వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పదవులు ఇస్తుందని విమర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అత్యున్నతమైన రాజ్‌భవన్ ను కూడా అవమానపరుస్తున్నారని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆమె.. ‘అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్ని రంగాల్లో ఉన్న మహిళా అధికారులకు ఆహ్వానాలు పంపామని.. వేడుకలకు అందరూ హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. కానీ, రాష్ట్రంలో ఆ విధానాన్ని మరిచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న మహిళను అవమానిస్తున్నారని తమిళిసై ఆరోపించారు.
‘‘రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. వివక్ష చూపిస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారు. మహిళపై రాళ్లు విసిరిన వ్యక్తులకే పూలదండలు వేస్తూ.. అలాంటి వారిని సన్మానిస్తూ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఇది చాలా దురదృష్టకర పరిణామం’’ అని తెలిపారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. మొత్తం మహిళలకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. ‘‘సంస్కృతీ సంప్రదాయాలున్న రాష్ట్రం తెలంగాణ. నా పట్లే కాదు.. ఏ మహిళ పట్ల అవమానకరంగా మాట్లాడినా సహించేది లేదు. నా విజ్ఞప్తి ఒక్కటే.. మహిళలను గౌరవించండి. సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించండి. మహిళలను అదే పనిగా తూలనాడొద్దు’’ అని హితవు పలికారు.
రాష్ట్రంలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని.. ప్రతిభావంతురాలైన పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రమదేవి పుట్టిన నేల ఇదని.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ‘ఒక మహిళకు అన్యాయం జరిగితే.. నేను వెంట నడుస్తాను. నాకు జరిగితే మీరంతా వెంట ఉంటారని బలంగా విశ్వసిస్తున్నా. మరింత దృఢంగా మారతాను’ అని పేర్కొన్నారు.
తనను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారని, తాను వచ్చిన విలినార్ ప్రాంత వీర మహిళలకు ప్రసిద్ధి చెందినదని వివరించారు. అలాంటి ప్రదేశం నుంచి వచ్చిన తాను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తోందని బాధపడ్డారు. తనను ఎంతో విమర్శిస్తున్నారని.. అయినా తాను తెలంగాణ ప్రజల కోసం నిలబడతానని తెలిపారు. హేళనకు గురైనా మహిళల కోసం పని చేస్తూనే ఉంటాననని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్తో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు.