అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చేపడుతోన్న ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోగ్య మహిళ’ నేడు ప్రారంభం కానుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఇది అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు చేతుల మీదగా కరీంనగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటింటికి సౌభాగ్యం’ నినాదంతో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం పీహెచ్‌సీలు, యూహెచ్‌సీల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వడంతోపాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపించి చికిత్స చేయిస్తారు.
రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి ఎనిమిది ప్యాకేజీల్లో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక వ్యాధి నిర్దారణ, క్యాన్సర్ స్ర్కీనింగ్, వెయిట్ మేనేజ్‌మెంట్, సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్లు, పీసీవోడీ, రుతుస్రావ సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటీ మేనేజ్‌మెంట్, మెనోపాజ్ మేనేజ్‌మెంట్, ఐవీ, యూటీఐ అండ్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాదులతో పాటు ఇతర సమస్యలతో వచ్చే మహిళలకు మహిళా క్లినిక్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ డయ్నాగోస్టిక్ పోర్టల్‌లో ప్రత్యేక లింకును రూపొందించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలను నమోదు చేస్తారు. ఏదైనా వ్యాధి నిర్ధారణ జరిగితే తగిన చికిత్స అందజేస్తారు. ఽథెరపీ మెడికేషన్స్, కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మెరుగైన వైద్యసేవలు అవసరమైతే జిల్లాస్థాయిలోని రిఫరల్ ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు, డ్వాక్రా సంఘాల మహిళల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తుృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పరీక్షలకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన 24 జిల్లాల్లోని వంద ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.