తెలంగాణలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కిన నర్సింహులుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముందుగా ఇటీవల మరణించిన నటుడు తారకరత్న మృతికి సంతాపంగా మౌనం పాటించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ “తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంది అనేవారికి ఖమ్మం సభే సమాధానం. ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోంది. కాసాని జ్జానేశ్వర్ నేతృత్వంలో తెలంగాణ టీడీపీ పరుగులు దూసుకెళ్తుంది. తెలంగాణలో మొదటి సీటు నాయిబ్రాహ్మణులకు, రెండో సీటు రజకులకు ఇస్తాం. యువత అండగా ఉండాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలంగాణ గడ్డపైనే పార్టీని స్థాపించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయి. పేదవారికి ఎన్టీఆర్ భూమిని ఇచ్చారు.
భూమిశిస్తు రద్దు చేసి రైతులకు అండగా నిలిచారు. హైదరాబాద్‌లో మౌళిక వసతులు కల్పించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోంది. టీడీపీ హయంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగింది. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. సమిష్టిగా కృషిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి. ప్రజల్లో ఉన్న నాయకులను మాత్రమే పార్టీ గౌరవిస్తుంది. ” అని చంద్రబాబు తెలిపారు.