టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు కారణం.. తాజాగా ఆమె ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అనే అన్నమయ్య కీర్తను ఆలిపిస్తూ, ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో శ్రావణ భార్గవి పుస్తకం చదువుతూ, కాళ్లు ఊపుతూ, తినుబండారాలు తింటూ కనిపించారు. ఈ వీడియోను వీక్షించిన.. అన్నమయ్య అనువంశీకులైన తాళ్లపాక వెంకట రాఘవ తీవ్రంగా మండిపడుతూ..’అన్నమయ్య కీర్తనను ఆమెకు ఆమె అన్వయించుకొని, కాళ్లు ఊపుతూ, అలా అసభ్యకరంగా అభినయించడం అన్నమయ్య కీర్తనని అపహాస్యం చేసినట్టే’ అని అన్నారు.
అనంతరం శ్రావణ భార్గవి స్పందిస్తూ.. “ఓ శృంగార కీర్తనను ఓ అమ్మాయి అభినయిస్తే తప్పేంటి? కాళ్లు ఊపడంలో ఆశ్లీలం ఏముంది? నేను కూడా బ్రాహ్మణ మహిళేనే. నాకు సంప్రదాయాలు తెలుసు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పాటని రూపొందించాను. దైవాజ్ఞ లేకపోతే ఆ వీడియో బయటకు వచ్చేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించేది లేదు” అని ఆమె స్పష్టం చేశారు. “దుప్పటి కప్పుకొన్న అమ్మాయి కూడా ఆశ్లీలంగా కనిపిస్తే మీ చూపులోనే తేడా ఉన్నట్టు” అంటూ శ్రావణ భార్గవి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
”భార్గవిని ఫోన్లో సంప్రదించాను. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. సంస్కారం లేకుండా మాట్లాడారు. ఈ వీడియోని వెంటనే డిలీట్ చేయాలని, జరిగిన దానికి శ్రావణ భార్గవి క్షమాపణ చెప్పాలి. అన్నమయ్య కీర్తనల్ని వెంకటేశ్వరస్వామికి అంకితం చేశారు, ఎవరు ఆ పాటల్ని ఆలపించినా, అభినయించినా అన్నమయ్య కీర్తి ప్రతిష్ఠలను, సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పాటకు శాస్త్రీయంగా నృత్యం చేసి, అభినయిస్తే తప్పు లేదు. ఓ వివాహిత అయి, కాళ్లకు మెట్టెలు కూడా లేకుండా కనిపించడం సంప్రదాయం కాదు” అని అన్నమయ్య కుటుంబీకులు అన్నారు.