చిదంబరం కనిపించడం లేదు..
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కనిపించకుండా పోయారు. ఆయన నివాసానికి సీబీఐ, ఈడీ అధికారులు వెళ్ళి ఆయన కోసం ప్రయత్నించారు.. అయినా ఆయన జాడ తెలియడం లేదు. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంచినట్లు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టును ఎదుర్కొనబోతున్న ఆయన ఇలా అకస్మాత్తుగా కనిపించకపోవడంపై హైడ్రామా నెలకొంది. దీంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి ముందస్తు బెయిలు మంజూరు చేయకపోవడంతో ఆయన నివాసానికి సీబీఐ, ఈడీ అధికారులు మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెళ్ళారు. కానీ ఆయన తన నివాసంలో లేరు. చట్టానికి చిక్కకుండా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన అపీలుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం బుధవారం విచారణ జరుపుతుంది. చిదంబరానికి ముందస్తు బెయిలు మంజూరు చేయరాదని సీబీఐ, ఈడీ ఢిల్లీ హైకోర్టును కోరాయి. ఆయన తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించవలసి ఉందని పేర్కొన్నాయి. చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలోనే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులు ఐఎన్ఎక్స్ మీడియాకు లభించాయని తెలిపాయి. ఐఎన్ఎక్స్ మీడియాకు రూ.305 కోట్లు విదేశీ నిధులు వచ్చాయని తెలిపాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసేందుకు తిరస్కరించింది.