ఐపీఎల్ మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రెండు సులువైన క్యాచ్‌లను విరాట్ చేజార్చాడని.. అలాగే బ్యాటింగ్‌లో కూడా ఘోరంగా విఫలం అయ్యాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి ఐపీఎల్ యాజమాన్యం భారీగా జరిమానా విధించింది. కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరిగిన ఆటలో స్లో ఓవర్ రేట్‌కు కారణం అయ్యాడనే కారణంతో కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జట్టు సారధి అయిన కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్‌లో కోహ్లీ కూడా పూర్తిగా విఫలం అయ్యాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ క్యాచ్‌ని రెండు సార్లు డ్రాప్ చేయడంతో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ‘లాక్డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లీ ఎదుర్కొన్నాడు’ అంటూ విరాట్ ఔట్ అయిన సందర్భంగా భారత క్రికెట్ లెజెండ్, కామెంట్రేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ భార్య అనుష్క శర్మ ఘాటుగా స్పందించింది. ‘మిస్టర్ గవాస్కర్.. మీ వ్యాఖ్యలు నా భర్తను అగౌరవపర్చేలా ఉన్నాయి. భర్త ఆట తీరు గురించి భార్యపై ఆరోపణలు చేస్తారా? భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో వివరిస్తే బాగుంటుంది’ అని అనుష్క ఇంస్టాగ్రామ్లో ప్రశ్నించింది.