శ్రీశాంత్…టీం ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్. భారత్ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగి స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అర్థాంతరంగా కెరీర్ ముగించేశాడు. తన ఆటతో పాటు..వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీశాంత్ సుమారు పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సారి ఆటగాడిగా కాదు..కామెంటేటర్‌గా అవతారమెత్తబోతున్నాడు. 2023 ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన కామెంటేటరీ ప్యానల్‌లో శ్రీశాంత్ పేరు ఉంది. అంతే కాదు హర్భజన్‌సింగ్‌తో కలిసి అతడు ఐపీఎల్ మ్యాచ్‌లకు కామెంటరీ అందించబోతున్నాడు.
2008 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన శ్రీశాంత్‌ను..మైదానంలోనే అప్పటి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్బజన్ సింగ్ చెంపదెబ్బకొట్టాడు. హర్భజన్ కొట్టడంతో శ్రీశాంత్ చిన్నపిల్లాడిలా బెక్కిబెక్కి ఏడ్చాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పినప్పటికీ తీవ్ర నేరంగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు ఆ సీజన్ ఆడకుండా భజ్జీపై నిషేధం విధించాడు. భజ్జీ కొట్టినందుకే తాను ఏం బాధపడలేదని కూడా శ్రీశాంత్ పలు సందర్భాల్లో చెప్పాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా వీరిద్దరు కలిసి కామెంటేటర్లుగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.
2013లో రాజస్థాన్ రాయల్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించడంతో అతను ఆటకు దూరమయ్యాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టులో పోరాడడంతో నిషేధం ఎత్తివేయబడింది. అయితే మళ్లీ ఐపీఎల్‌లో ఆడేందుకు శ్రీశాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫ్రాంచైజీలు అతన్ని పట్టించుకోకపోవడంతో క్రమంగా ఆటకు దూరమయ్యాడు. చివవరికి కామెంటేటర్‌గా సందడి చేయనున్నాడు శ్రీశాంత్.
శ్రీశాంత్ తో పాటు పాల్ కాలింగ్‌వుడ్, ఆరోన్ ఫించ్‌లను కూడా ఈ ప్యానెల్‌లో చేర్చారు. అలాగే ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా వీరితో కలిసి ఆడియెన్స్‌ని ఆకట్టుకోనున్నాడు.మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.