ippatam People set up plexiglasses against Pawan Kalyan's cash assistance
mictv telugu

పవన్ కల్యాణ్‌‌కి షాకిచ్చిన ఇప్పటం ఇంటి యజమానులు

November 9, 2022

ఏపీలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్థులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌‌కు షాకిస్తున్నారు. ఇటీవల ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిందని ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారి తీసింది.

రోడ్డు కోసం ప్రహరీ గోడను మాత్రమే కూల్చామని, ఇళ్లను కాదని ప్రభుత్వం తరపున మంత్రులు స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో బాధితులకు పవన్ తన పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అయితే ఈ సాయంపై ఇప్పటం గ్రామస్థులు పవన్ షాకయ్యే పని చేశారు. తమకు ఎవరి సానుభూతి అక్కర్లేదని, తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని తమ ఇళ్లపై ప్లెక్సీలు వేలాడదీశారు. అంతేకాక, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయాలని చూడవద్దని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మా ఇళ్లను కూల్చలేదు. మీ ఎవ్వరి సానుభూతి మాకు అక్కర్లేదు. డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయాలని చూడవద్దు. ఇట్లు ఇప్పటం గ్రామస్థులు’ అని రాసిన ప్లెక్సీలను విరివిగా ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో ఇప్పటికే పవన్ పర్యటించగా, నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఇలాంటి బ్యానర్లు వెలియడం ప్రాధాన్యం సంతరించుకుంది.