Home > Featured > ఇదేందయ్యా.. సీఎం కాళ్లు మొక్కిన నాలుగో సింహం

ఇదేందయ్యా.. సీఎం కాళ్లు మొక్కిన నాలుగో సింహం

కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులతో చెప్పులు తెప్పించుకోవడం, కాళ్ళు పట్టించుకోవడం, షూలేస్ కట్టించుకోవడం తరహా అనేక ఉందంతాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా పశ్చిమ బెంగాల్‌లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తానుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాదాలకు నమస్కారం చేసిన ఉదంతం దుమారం రేపుతోంది. విధి నిర్వహణలో ఉండి, యూనిఫాం ధరించి మరీ ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేయడం వివాదం అవుతోంది. ఈ నెల 21న ఈస్ట్ మిడ్నాపూర్‌లోని దిఘాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియోను బెంగాల్ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

సదరు అధికారి పేరు రాజీవ్ మిశ్రా, ఐజీ ర్యాంకులో పనిచేస్తున్నారు. ఈ నెల 21న మమతా ఈస్ట్ మిడ్నాపూర్ రేంజ్‌లోని దిఘా పర్యటనకు వెళ్లారు. అదే రోజు వినీత్ గోయెల్ అనే ఐపీఎస్ అధికారి పుట్టినరోజు కావడంతో ఆమె కేక్‌ తెప్పించి కట్ చేయించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాను స్వయంగా వినీత్‌కు కేక్ తినిపించారు. అదే కేక్‌ను ఆయన పక్కనే ఉన్న రాజీవ్ మిశ్రాకు తానే తినిపించారు. ఈ సందర్భంగా రాజీవ్ మిశ్రా మమతా పాదాలను నమస్కరించారు. యూనిఫాంలో ముఖ్యమంత్రి పాద నమస్కారం చేయడంపై పలువురు పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వారు రాజీవ్ మిశ్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

రాజీవ్ చర్యలపై బీజేపీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మమతా పోలీసు యంత్రాంగం మొత్తాన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారనడానికి ఈ సంఘటన చక్కని ఉదాహరణ అని విమర్శిస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ఆమె పాలన సాగిస్తున్నారని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. కొందరు సీనియర్ పోలీసు అధికారులు, విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్లు సైతం రాజీవ్ చేసిన చర్యను తప్పు పడుతున్నారు. మమతా పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి ఆయనకు ఇంతకంటే మంచి సందర్భాలు, వేదికలు చాలానే ఉన్నాయని అంటున్నారు.

Updated : 28 Aug 2019 8:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top