డేరింగ్ పోలీసాఫీసర్ రూపపై సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

డేరింగ్ పోలీసాఫీసర్ రూపపై సినిమా

July 25, 2017

కర్నాటక ఐపీఎస్ అధికారి రూప గుర్తుంది కదా..అదే చిన్నమ్మ శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తుందని గుట్టురట్టు చేసి కర్నాటక సర్కార్ ని షేక్ చేసింది. రూప తీసుకున్న సంచలన నిర్ణయాలే కథాంశాలుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఐపీఎస్‌ రూప జీవితం, పరప్పన జైలు అక్రమాలే స్టోరీగా
దర్శకుడు ఏఎంఆర్‌ రమేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా సైనైడ్, అట్టహాస చిత్రాలను తీసిన ఏ.ఎం.ఆర్‌.రమేశ్‌ కన్నడ, తమిళ భాషల్లో మూవీని నిర్మించబోతున్నారు.

సెంట్రల్‌ జైల్లో శిక్షననుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు అతిథి మర్యాదలు కల్పించడానికి అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకున్నట్లు డీఐజీ డీ.రూప బయటపెట్టారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశమైంది. ఈ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రమేశ్‌ ప్రయత్నిస్తున్నారు. ఇందులోనే జైళ్లలో వాస్తవ పరిస్థితులతో పాటు గతంలో ఒక డీఐజీ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూపించించనున్నారు. హీరోయిన్‌గా రీల్ పోలీస్ మాలాశ్రీ కాని, ఇప్పుడిప్పుడే పోలీస్‌పాత్రలు వేస్తున్న రాగిణి ద్వివేదిని కానీ ఎంచుకునే చాన్స్ ఉంది. కనీసం ఒక్క సీన్‌లోనైనా ఐపీఎస్‌ అధికారి రూపను నటింపచేయాలని చిత్ర యూనిట్‌ విశ్వప్రయత్నాలు చేస్తుందట.

రూప అనుమతి తీసుకున్నాకే కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కిస్తామని, తెలుగులో కూడా విడుదల చేసే విషయం పరిశీలనలో ఉందని డైరెర్టర్ రమేష్ అంటున్నారు. చిత్రం టైటిల్‌లో రూప పేరు ఉండనుండడంతో ఐపీఎస్‌ అధికారి డీ.రూప అనుమతి తప్పనిసరని, ఇప్పటికే సినిమాపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించామన్నారు.