అటు ఇటు పోయి ఐపిఎస్ ల మెడకు చుట్టుకుంది - MicTv.in - Telugu News
mictv telugu

అటు ఇటు పోయి ఐపిఎస్ ల మెడకు చుట్టుకుంది

December 16, 2017

ఉట్నూరు ఆదివాసీలు, లంబాడాల గొడవను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఒక్కసారిగా చెలరేగిన అల్లర్లతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. జిఈఎస్, తెలుగు మహాసభల కారణంతో ఇన్ని రోజులు ఎస్టీ రిజర్వేషన్ల విషయాన్ని  లైట్ తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు ఆ సమస్యపై దృష్టి పెట్టింది. అయితే దానికి పరిష్కారం చూపించే దిశలో ప్రభుత్వం ఆలోచించడం లేదని తాజాగా జరిగిన ఐపిఎస్ ల బదిలీలతో అర్థం అయింది.

రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను పసిగట్టి, అల్లర్లను నివారించడంలో విఫలం అయ్యారని కరీంనగర్ రేంజ్ డిఐజీ రవివర్మను బదిలీ చేసింది. డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్  కమీషనర్ ప్రమోద్ కుమార్ ను కరీంనగర్ డిఐజీగా నియమించింది.  నిర్మల్ ఎస్పీగా ఉన్న  విష్ణు వారియర్ ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేయడంతో పాటు నిర్మల్ ఎస్పీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్న శ్రీనివాసులను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంది. నాగర్ కర్నూల్ ఎస్పీగా ఉన్న కమలేశ్వర్ ను ఆసిఫాబాద్ కు షిప్ట్ చేసి, అక్కడున్న సన్ ప్రీత్ సింగ్ ను నాగర్ కర్నూల్ కు ట్రాన్స్ ఫర్ చేసింది.

                కరీంనగర్ డిఐజీ  గా ఛార్జ్ తీసుకోబోతున్న  ప్రమోద్ కుమార్ ఖతర్నాక్ అని డిపార్ట్ మెంట్ లో పేరుంది. నిర్మల్ ఎస్పీ విష్ణు వారియర్, ఆసిఫాబాద్ ఎస్పీ కమలేశ్వర్ లు కూడా ప్రమోద్ కుమార్ టైపేనట. ఆ నమ్మకంతోనే ఈ సున్నిత సమస్యను పరిష్కరించే బాధ్యతలను ప్రభుత్వం వీరికి అప్పగించింది. ఇరు వర్గాలతో చర్చించే ఓపిక, ఉద్దేశ్యం తమకు లేదని తాజా బదిలీలతో తేల్చిన ప్రభుత్వం, పోలీస్ పవర్ తోనే ఈ అల్లర్లకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. అయితే గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న  ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆలోచనను మార్చుకోవాలి. శాంతిభద్రతల కోణంలో చూడడం బంద్ చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఇది రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.