ఐపీఎస్ అయ్యాక నువ్వెవరో తెలియదు అంటున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎస్ అయ్యాక నువ్వెవరో తెలియదు అంటున్నాడు..

October 29, 2019

Ips trainee officer mahesh reddy bhavan marriage

ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ రెడ్డి తనను మోసం చేశాడని భావన బిరుదుల అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేష్ రెడ్డికి తనకు 2018లో పెళ్లి జరిగిందని, తాజాగా మహేష్ రెడ్డి ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

దీని గురించి భావన మాట్లాడుతూ..’2009లో ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్ రెడ్డి నాకు పరిచయమయ్యాడు. ఇద్దరం ప్రేమించుకున్నాం. 2018లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న విషయం మా కుటుంబ సభ్యులకు తెలుసు. మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పమని ఎన్ని సార్లు అడిగిన తను తర్వాత పరిచయం చేస్తానని దాటవేశాడు. తను ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో తనకు అన్ని రకాల ఆర్థిక సాయం చేశాను. ఇప్పుడు ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. అదనపు కట్నం తీసుకుని వస్తేనే కాపురం చేస్తానని పలుమార్లు బెదిరించాడు. మహేష్‌కు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నట్లు కూడా తెలిసింది. దీంతో విడాకులు కావాలని నా పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. తన స్నేహితులను కూడా పలుమార్లు ఇంటికి పంపించి బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాను. పలు మార్లు మాకు కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా తను విడాకులు కావాలంటూ నాపై ఒత్తిడి తీసుకువచ్చాడు. మా కుటుంబ సభ్యులకు రక్షణ కావాలి’.. అని ఆవేదన వ్యక్తం చేసింది.

పెళ్లికి ముందు తన కులం గురించి మాట్లాడని మహేశ్ ఇప్పుడు నువ్వు ఎస్సీవి అని, ప్రధానమంత్రి కూతురైనా ఎస్సీ అమ్మాయిని తమింట్లో వాళ్లు కోడలిగా అంగీకరించరని అంటున్నాడని ఆమె ఆరోపించింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు తనకు తెలుసంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మహేష్‌ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జవహెర్ నగర్ పోలీసులు తెలిపారు. మహేష్‌తో జరిగిన పెళ్లి ఫోటోలను, మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోను భావన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.