iran-couple-jailed-for-more-than-10-years-over-viral-dance-video
mictv telugu

డాన్స్ చేసిన పాపానికి జైలుపాలయ్యారు

February 2, 2023

 iran-couple-jailed-for-more-than-10-years-over-viral-dance-video

ఇరాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోజురోజుకూ అక్కడ ఆంక్షలు ఎక్కువవుతున్నాయి. మహిళలు హిజాబ్ కచ్చితంగా హిజాబ్ ధరించాలని, చదువుకోకూడదని రూల్స్ పెట్టారు. వీటి మీద చాలా రోజుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా ఇరాన్ లో జరిగిన ఓ సంఘటన మీద అక్కడి ప్రజలు మండిపడిపోతున్నారు. అన్యాయంగా ఓ జంటను అరెస్ట్ చేసిన విధానం అక్కడి ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అయితే ఆ జంగ కూడా ప్రభుత్వం మీద ఉన్న తమ వ్యతిరేకతను తెలియజేయడానికే ఆ డాన్స్ ను చేసినట్లు తెలుస్తోంది.

సుమారు 20 ఏళ్ల వయస్సున్న ఒక యువ జంట ఇరాన్ ప్రభుత్వం విధించిన అమానవీయ ఆంక్షలకు వ్యతిరేకంగా నవంబర్ లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ ముందు డ్యాన్స్ చేశారు. అస్తియాజ్ అజీజీ ,ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది అక్కడ కొంతసేపు పాటు రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇరాన్ ప్రజలు బహిరంగంగా డ్యాన్స్ చేయడాన్ని ఒక శక్తిమంతమైన ఆయుధంగా వాడుతున్నారు.

అయితే అస్తియాజ్ అజీజీ డ్యాన్స్ చేస్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదు. అంతేకాదు బహిరంగంగా డ్యాన్స్ చేసింది. ఇరాన్ లో మహిళలు బహిరంగంగా డాన్స్ చేయడం నేరం. మగవారితో కలిసి నాట్యం చేయడం ఇంకా పెద్ద నేరం. దాంతో ఆ చర్యను రాజ్య ధిక్కరణగా నిర్ధారించిన ఇరాన్ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసింది.వారికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. వారి తరఫున వాదించడానికి లాయర్లనూ అనుమతించలేదు. ఏకపక్ష విచారణ చేసేసిన ఇరాన్ రెవొల్యూషనరీ కోర్టు వాళ్ళకు 10 ఏళ్ళ ఆరు నెలల జైలుశిక్షను విధించేసింది. అలాగే వారు ఇంటర్నెట్ ను వాడకూడదని నిషేధం విధించింది.

జైలు శిక్ష పడిన అస్తియాజ్ అజీజీ , ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది ఇరాన్ లో ఇన్ స్టా గ్రామ్ బ్లాగర్స్ గా చాలా పాపులర్. హిజాబ్ నిబంధనను పాటించని మాసా అమిని పోలీసుల కస్టడీలో మరణించిన తర్వాత ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. ప్రభుత్వం కూడా వాటిని అంతే తీవ్రంగా అణచివేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు నిరసనల్లో పాల్గొంటున్న సుమారు 14 వేల మందిని అరెస్ట్ చేసింది.