Iran executed at least 105 people between January and March: UN
mictv telugu

బాబోయ్.. బాల నేరస్థులతో సహ 3 నెలల్లో 105 మందికి ఉరిశిక్ష

June 22, 2022

vuri

నేరం రుజువైన కారణంగా ఇరాన్ దేశంలో మైనర్లు సహా 105 మందిని ఉరి తీశారు. కేవలం మూడు నెలల వ్యవధిలో వంద మందికిపైగా వ్యక్తులకు ఉరి శిక్షను అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన నేరాలతో పాటు అంతకంటే తక్కువ నేరాలకు కూడా ఆ దేశంలో ఉరిశిక్షను ఖరారు చేశారు. ఉరితీతకు గురైన వారిలో మైనారిటీ వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల మండలిలో మానవ హక్కుల డిప్యూటీ చీఫ్ నాడా అల్-నషిఫ్ ఈ ఉరిశిక్షలకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేశారు. 2020వ సంవత్సరంలో 260 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించగా, 2021లో కనీసం 14 మంది మహిళలతో సహా 310 మంది వ్యక్తులను ఉరితీశారని ఆ సర్వేలో చెప్పారు. ఈ సంవత్సరంలో కేవలం మూడు నెలల కాలంలో జనవరి 1, మార్చి 20 తేదీల మధ్య 105 మందికి మరణశిక్ష విధించారు.

ఉరిశిక్షలు పెరగడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్రగ్ కేసుకు సంబంధించిన ఆరోపణలపై 52 మందిని ఉరిశిక్ష కోసం షిరాజ్ జైలుకు తరలించినట్లు నషిఫ్ చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ బాల నేరస్తులకు మరణశిక్షను కొనసాగించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మైనర్‌ నేరాల కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించారు. 85 కంటే ఎక్కువ బాల నేరస్థులు మరణశిక్షకు గురయ్యారని ఆమె చెప్పారు.