Iranian women burning hijab
mictv telugu

జుట్టు కత్తిరించి హిజాబ్‌ను కాల్చేస్తున్న ఇరాన్ మహిళలు.. ఎందుకంటే

September 19, 2022

ముస్లిం దేశమైన ఇరాన్‌లో మహిళలు, యువవతులు జుట్టు కత్తిరించుకుంటున్నారు. హిజాబ్ తీసేసి తగులబెడుతున్నారు. చట్టాల పేరుతో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న వివక్షపై తిరగబడుతున్నారు. మత ఛాందసవాదాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఏడేళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా హిజాబ్ వేసుకోవాలి. జుట్టును పూర్తిగా కప్పేసి ఉంచాలి. ఈ కఠిన నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు అరెస్టులు కూడా ఉంటాయని దేశాధ్యక్షుడు జులైలో ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ అంశాల అమలును పర్యవేక్షించేందుకు మొరాలిటీ పోలీస్ విభాగాన్ని ప్రారంభించాడు. అయితే ఇటీవల 22 ఏళ్ల యువతి మహ్సా అమినిని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న ఆరోపణపై ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడే గుండెపోటుకు గురైన అమిని, తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. దీంతో పోలీసులే వేధించి చంపేశారంటూ ఆ దేశంలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. అనేక మంది మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో మహిళలను అణచివేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా కొందరు వినూత్నంగా ఆందోళన చేస్తున్నారు. తమ జుట్టు కత్తిరించుకొని, హిజాబ్‌లను కాల్చేస్తున్నారు. ఓ వీడియోను మహిళా జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఏడేళ్ల నుంచి హిజాబ్ వేసుకోకపోతే మమ్మల్ని స్కూల్లో అనుమతించరు. ఉద్యోగాలు ఇవ్వరు. ఇలాంటి చట్టాలతో మేం విసిగిపోయాం’ అని రాసుకొచ్చారు.