ఆ 39 మంది భారతీయులను చంపేశారు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ 39 మంది భారతీయులను చంపేశారు

March 20, 2018

ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నాలుగేళ్లకిందట కిడ్నాప్ చేసిన మొత్తం 39 మంది భారతీయుల విషయంలో భయపడినంతా జరిగింది. వారిని ముష్కరులు హత్య చేసి పూడ్చిపెట్టినట్లు తేలింది. 38 మృతదేహాల డీఎన్ఏలు వారి బంధువుల డీఎన్ఏలతో సరిపోలాయి. మరొకరి డీఎన్ఏ 70 శాతం సరిపోలింది. ఈ 39మంది చనిపోయినట్లు తమకెలాంటి ఆధారాలూ లేవని చెబుతున్న భారత ప్రభుత్వ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. ఈమేరకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు.

మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరభారతీయులు. బిహార్, పంజాబ్, హిమాలచ్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వాసులు. బతుకుతెరువు కోసం వీరు మోసుస్ దగ్గర్లోని ఓ నిర్మాణ కంపెనీలో పని చేయడానికి ఇరాన్ వెళ్లారు.2014లో మోసుల్ నుంచి వస్తుండగా ఐసిస్ దుర్మార్గులు కిడ్నాప్ చేశారు. తర్వాత మోసుల్ దగ్గర్లోని బాదుష్ గ్రామ సమీపంలో హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ మతరక్కసుల బారి నుంచి తప్పించుకున్న హర్జిత్ మాసీ అన వ్యక్తి.. ఈ విషయాన్ని అప్పుడే వెల్లడించాడు.

అయితే అతడు చెబుతున్నదానికి గట్టి ఆధారాల్లేవని, భారతీయులు ఐసిస్ చెరలోనే  ఉన్నట్లు తమకు ఆధారాలు ఉన్నాయని, వారిని కాపాడేందుకు యత్నిస్తున్నామని భారత సర్కారు చెబుతూ వచ్చింది. మోసుల్‌ను గత ఏడాది జూన్‌లో ఇరాకీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జూలైలో రాడార్ చిత్రాలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించగా భారీ మట్టిదిబ్బలు వెలుగు చూశాయి. అక్కడ తవ్వకాలు జరపగా సామూహికంగా చంపేసి పూడ్చిపెట్టినట్లు తేలిసింది.

మా మిత్రదేశ పౌరులను మతోన్మాదులు బలిగొన్నారు...’ అని ఇరాక్ అమలవీరుల సంస్థ ఓ ప్రకటనలో తాజాగా తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం జీర్ణించిపోయిన మృతదేహాలను బాగ్దాద్‌కు పంపారు. తర్వాత డీఎన్ఏ నమూనాలు తీసుకుని బంధువు డీఎన్ఏలతో సరిపోల్చారు. మృతదేహాలు భారత దేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ సహాయ మంత్రి మంత్రి వీకే సింగ్‌ ఇరాక్‌ వెళ్తున్నారు. వాటిని మొదట అమృత్‌సర్‌,  తర్వాత పట్నా, కోలక్‌తాలకు చేరవేరస్తారు.