Home > Featured > ఆ రైళ్లు ప్రైవేటుకు అప్పగింత!

ఆ రైళ్లు ప్రైవేటుకు అప్పగింత!

IRCTC Delhi-Lucknow.

రైళ్లు ఇక ప్రైవేటు పరం కానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రైళ్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమైందని.. ఇందులో భాగంగా అహ్మదాబాద్–‌‌ముంబై, ఢిల్లీ–లక్నో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రయోగాత్మకంగా ఐఆర్​సీటీసీ (రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) నడుపుతుందని రైల్వే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. వరల్డ్ క్లాస్ సేవలు అందించేందుకు ప్రైవేటు ట్రైన్ ఆపరేటర్లను తీసుకురావాలని ఇప్పటికే రైల్వే తన వంద రోజుల ప్రణాళికలో ప్రతిపాదించింది. రెండు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐఆర్‌సీటీసీకి అప్పగించడం ఆ దిశగా వేస్తున్న మొదటి అడుగు అని అన్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా ముందుగా ఈ రెండు రైళ్లను మూడేళ్లపాటు ఐఆర్​సీటీసీకి అప్పగించేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది. ఏడాదిపాటు టికెట్ల అమ్మకాలకు రైల్వే వెబ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు రైళ్ల రెవెన్యూ అకౌంట్లను విడిగా నిర్వహిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రైలు బోగీలపై ప్రకటనల హక్కులు ఐఆర్​సీటీసీ కలిగి ఉంటుందని స్పష్టంచేశారు. రైలు సెక్యూరిటీకి ప్రమాదం లేకుండా కోచ్‌ల లోపలి వైపు మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రెండు రైళ్ల సర్వీసులకు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రాధాన్యమే ఉంటుంది. ఏమైనా ప్రమాదం జరిగితే, ఐఆర్​సీటీసీ ప్రయాణికులను రైల్వే ప్రయాణికులతో సమానంగా చూస్తామని, ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్స్ చేసుకునేందుకు అర్హత వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు సర్వీసులు అందించడం, పునరుద్ధరించే బాధ్యతలు రైల్వే తీసుకుంటుందని తెలిపారు.

వారంలో ఆరు రోజులు నడిచే ఈ రెండు రైళ్లలో ఎటువంటి రాయితీలు, డ్యూటీ పాసులు చెల్లవు అని అధికారులు తెలిపారు. సామాన్యుడికి అందుబాటు ధరలో టికెట్ల ధరలు వుంటాయని.. టికెట్ ధరను కూడా ఐఆర్​సీటీసీనే నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఈ రైళ్లలో రైల్వే సిబ్బంది ఆన్-బోర్డు టికెట్ తనిఖీ చేయరని, గార్డ్స్, లోకో పైలట్, స్టేషన్ మాస్టర్ వంటి విధుల్లో మాత్రం రైల్వే సిబ్బందే ఉంటారని పేర్కొన్నారు.

Updated : 21 Aug 2019 1:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top