మాట నిలబెట్టుకున్న తేజస్.. రూ.1.62లక్షల పరిహారం చెల్లిస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

మాట నిలబెట్టుకున్న తేజస్.. రూ.1.62లక్షల పరిహారం చెల్లిస్తోంది

October 21, 2019

Tejas Express.

మాటలకు ఏంటి ఎన్నైనా అంటాం.. అన్నవన్నీ కార్యాచరణలో పెడతారా ఏంటి? అనే మాటకు ఆస్కారం లేకుండా అన్నమాటను నిలబెట్టుకుంది తేజస్. తేజస్ పేరు ఎత్తగానే మీకు మ్యాటర్ ఏంటో అర్థమై వుంటుంది. తేజస్‌ రైలు ఆలస్యమై, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  నిర్దేశించిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ.100 చొప్పున, రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చొప్పున చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అయితే అది ఉత్తుత్తిగా అన్నమాటే కాదు.. నిలబెట్టుకునే మాట అని తేజస్ నిరూపిస్తోంది. అక్టోబర్‌ 19న రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో 950మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల పరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అందించనున్నామని అధికారులు తెలిపారు. 

ఆలస్యానికి ఇదీ కారణం అని సాకులు చెప్పకుండా.. అక్కడ ఏదైనా జరగవచ్చు, కానీ తప్పు తప్పే.. మాట మాటే అన్నంత పనే చేసింది. దీంతో రైళ్లు ఆలస్యమైతే పరిహారం చెల్లించే చరిత్రను తేజస్ సొంతం చేసుకోనుంది. అక్టోబర్‌ 19న లఖనవూ నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తేజస్‌ రైలు ఢిల్లీకి 12.25 చేరుకోవాలి. కానీ, కాన్‌పూర్‌ ప్రాంతంలో గూడ్సురైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో మధ్యాహ్నం 3.40 గంటలకు (3 గంటలకు పైగా ఆలస్యం) చేరుకుంది. తిరిగి 3.35గంటలకు లఖ్‌నవూకు బయలుదేరాల్సిన రైలు 5.30 గంటలకు గానీ కదలలేదు. దీంతో రాత్రి 10.05గంటలకు లఖ్‌నవూ చేరుకోవాల్సి ఉండగా.. గంటన్నర ఆలస్యంగా రాత్రి 11.30గంటలకు చేరుకుంది.  

ఈ నేపథ్యంలో లఖ్‌నవూ నుంచి ఢిల్లీకి వెళ్లిన 450మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున, ఢిల్లీ నుంచి లఖ్‌నవూకి వెళ్లిన 500మందికి ఒక్కొక్కరికి రూ.100చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తేజస్ టికెట్‌పై ఇచ్చిన బీమా సంస్థ లింక్‌ ద్వారా పరిహారం పొందవచ్చని అన్నారు. అక్టోబర్‌ 6నుంచి తేజస్ ఎక్స్‌ప్రెస్‌ వాణిజ్య సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే.