కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లే భక్తులకు ఐఆర్సిటిసి ఓ శుభవార్తను చెప్పింది. భక్తుల సౌకర్యార్థం హెలికాఫ్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ 22 నుంచి యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇదే క్రమంలో కేదార్‌నాథ్‌కు ఏప్రిల్ 25 నుంచి భక్తులను అనుమతిస్తారు. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న భక్తుల సందర్శనార్థం తెరుచుకోనుంది. దీంతో ప్రయాణికుల కోసం హెలికాఫ్టర్ సేవలను ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రలో పాల్గొంటుంటారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా భక్తులు యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి , యమునోత్రిలతో కూడిన ప్రసిద్ధ చార్ ధామ్ లు ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయాల్లో ఉన్న ప్రసిద్ధ ఆలయాలు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రమైన క్షేత్రాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ దర్శించుకుంటారు. ఒకప్పుడు చార్ ధామ్ యాత్రకు వెళ్లాలంటే భక్తులు అనేక వ్యయప్రయాసలు పడేవారు. కానీ ఇప్పుడు వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొత్త కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా https://heliyatra.irctc.co.in/ వెబ్‌సైట్‌ను రూపొందించిందారు అధికారులు. ఏప్రిల్ 25 న ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో ఏప్రిల్ 1న బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్, స్టేట్ టూరిజం డెవలప్మెంట్ వాట్సప్ సర్వీసుల్లో యాత్రికులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం Yatra అని టైప్ చేసి 918394833833 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చిన వివరాలను యాత్రికులు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా యాత్రికుల భద్రత కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల ప్రకారం హెలికాప్టర్ ఆపరేటర్లు పని చేస్తారు.
ఇప్పటివరకు 5.97 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో కేదార్‌నాథ్‌కు 2.2 లక్షల రిజిస్ట్రేషన్స్, బద్రీనాథ్‌కు 1.9 లక్షల రిజిస్ట్రేషన్స్, గంగోత్రికి 88,521 రిజిస్ట్రేషన్స్, యమునోత్రికి 87,352 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి.