రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్.. అన్ని ఫార్మాట్లకు బై.. - MicTv.in - Telugu News
mictv telugu

రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్.. అన్ని ఫార్మాట్లకు బై..

January 4, 2020

patanu02

టీమిండియా నుంచి మరో దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెరబుతున్నానని, వారంతా ఇకపైనా తనకు మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నానని అన్నాడు. 

 

‘గంగూలీ, ద్రవిడ్‌, లక్ష్మణ్‌ వంటి క్రికెట్‌ దిగ్గజాలతో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం నా అదృష్టం…’ అని ట్వీట్ చేశాడు.  గుజరాత్‌లోని వడోదరలో 1984లో జన్మించిన 35 ఏళ్ల ఇర్ఫాన్‌ 2003లో జాతీయ జట్టులో చేరి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆట మొదలెట్టాడు. ఆ మరుసటి ఏడాదే వన్డేల్లోనూ మెరిశాడు. అతని బౌలింగ్..  టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ శైలిలో ఉంటుందని నిపుణులు అంటారు. 2007లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు. 

ఇర్ఫాన్‌ పఠాన్‌ భారత్‌ తరఫున మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. 306 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 173, టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. 11 అర్ధసెంచరీతో కలిపి 2821 పరుగుతు చేశాడు. వన్డేల్లో 1544, టెస్టుల్లో 1105 నమోదు చేశాడు. 2012లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌లో చివరిసారిగా పాల్గొన్న ఇర్ఫాన్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌​ జట్టు మెంటార్‌ కమ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఇర్ఫాన్ నటనలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.