మరో టైటానిక్ ప్రమాదం.. ఇలా కాపాడారు.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో టైటానిక్ ప్రమాదం.. ఇలా కాపాడారు..

October 23, 2020

చుట్టూ అంతులేని మహాసముద్రం.. నలువైపుల నుంచి తాటిచెట్లంత ఎత్తయిన అలలు.. మధ్యలో మహానౌక.. కాలనాగుల్లా బుసలుకొడుతూ దాడిచేస్తున్న అలలు నుంచి కాపాడుకోలే నౌక చేతులెత్తేసింది. అలల్లో పూర్తిగా మునిగిపోయింది.  ఒకపక్క భారీ అలలు, మరోపక్క పెనుగాలుల ధాటికి ఒడ్డు వైపు కదిలింది. కాసేపుంటే ఒడ్డులోని కొండలను ఢీకొట్టడం, ముక్కచెక్కలు కావడం ఖాయం.. అదే జరిగితే కనీవినీ ఎరుగని నౌకావిధ్వంసం..!

టైటానిక్ సినిమా గుర్తుకొస్తోంది కదూ. 118 ఏళ్ల కిందట సముద్రంలోని మంచుకొండలను ఢీకొని రెండు ముక్కలుగా విరిగిపోయిన ఆ మహావిషాదం కళ్లముందు కదలాడుతోంది కదూ. అవును, అచ్చం అలాంటి ప్రమాదంలో ఓ నౌక తాజాగా చిక్కుకుపోయింది. కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే సముద్ర గర్భంలో కలిసిపోయేదే. కానీ కోస్ట్ గార్డ్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన దాన్ని కాపాడారు. అందులోని సిబ్బందికి ప్రాణం పోశారు. 

ఐర్లాండ్ తీరంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. లిలీ బీ అనే కార్గో నౌక జర్మనీలోని ఎల్బ్ ప్రాంతం నుంచి ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్ పోర్టుకు వస్తోంది. దారి మధ్యలో వెక్స్ ఫోర్డ్ తీరంలో ఉండగా హఠాత్తుగా ఓడలో పవర్ సప్లై ఆగిపోయింది. దీంతో ఉప్పొంగే కడలి మధ్య ఓడ చిక్కుకుపోయింది. వంద మీటర్ల పొడవు, 4000 టన్నుల బరువైన ఓడను సముద్ర కెరటాలు కాగితం పడవలా అటూ ఇటూ ఊపేశాయి. 20 అడుగుల ఎత్తయిన అలలు దాన్ని ముంచేశాయి. ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. సాయం కోసం కోస్ట్ గార్డు సిబ్బందికి ఎమర్జెన్సీ మెసేజ్ పంపారు. ఐరిష్ రాయల్ కోస్ట్ గార్డ్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగింది. తీరగస్తీ సైనికులు ప్రాణాలకు తెగించారు. పది లైఫ్ బోట్లతో ముగినిపోతున్న ఓడ వద్దకు చేరుకున్నారు. మరోపక్క ఓ హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగి  పైనుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది నౌకకు భారీ తాళ్లు కట్టి కొట్టుకుపోకుండా కాపాడారు. తర్వాత అందులోని సిబ్బంది మూడు భారీ లైఫ్ బోట్లలో సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. 12 గంటలు పాటు కష్టపడి భారీ లైఫ్ బోట్ల సాయంతో లిలీ బీని అదుపులోకి తీసుకొచ్చారు.